కాంగ్రెస్‌ పీఏసీ భేటీ.. నేతల మధ్య వాడీ వేడి చర్చ

హుజురాబాద్ ఓటమిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల మధ్య వాడీ వేడీ చర్చ సాగింది. గాంధీభవన్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో హుజూరాబాద్ ఓటమి, పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చించారు.

హుజూరాబాద్‌లోబీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాకుండా ఎస్సీని నిలబెడితే బాగుండేదని ఎంపీ వీహెచ్‌ అభిప్రాయపడ్డారు. అభ్యర్థి విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదన్నారు. కొంతమంది నేతలు ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు మీడియా ముందు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతల మాటలకు నొచ్చుకొని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ గాంధీభవన్‌ నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది.

మరోపక్క ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పరిస్థితిపై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య స్వల్ప వాగ్వాదం జరిగనట్టు సమాచారం. పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోకుండా.. బలహీనపడేటట్లు చేస్తున్నారని భట్టిపై  రేణుక అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.

కాంగ్రెస్‌ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ, వీహెచ్‌, షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.