నవజ్యోత్ సింగ్ సిద్దూకి ఏడాది జైలు శిక్ష

పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూకి సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 34 ఏళ్ళ నాటి కేసులో సిద్దూని దోషిగా నిర్దారించి ఈ తీర్పు వెల్లడించింది. సిద్దూ డిసెంబర్ 27, 1988న కారు పార్కింగ్ విషయంలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తితో గొడవపడి తలపై కొట్టాడు. ఈ ఘటనలో గుర్నామ్ సింగ్ తలకు గాయలై మరణించాడు. పటియాలాలోని సెషన్స్ కోర్టు సెప్టెంబరు 22, 1999న, సరైన సాక్ష్యాధారాలు లేవని సిద్ధూ మరియు అతని స్నేహితుడిని నిర్దోషులుగా ప్రకటించింది. దాంతో బాధిత కుటుంబసభ్యులు పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో సవాలు చేశాయి. దాంతో కోర్టు 2006లో సిద్ధూను దోషిగా నిర్ధారించి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిద్ధూ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. కేవలం ఒక్క దెబ్బతో వ్యక్తి చనిపోయాడనడానికి ఆధారాలు లేవని భావించిన కోర్టు.. సిద్దూకి బెయిల్ ఇచ్చింది.

ఆ తర్వాత ఇదే కేసులో 2018లో సుప్రీంకోర్టు మరో తీర్పు ఇచ్చింది. గొడవలో వ్యక్తిని కావాలనే గాయపరిచారనే కారణంతో సిద్ధూకి, అతని ఫ్రెండ్‌కి వెయ్యి రూపాయల జరిమానా విధించింది. ఆ తీర్పును సమీక్షించాలని బాధిత కుటుంబం మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో విచారించిన సుప్రీంకోర్టు.. సిద్దూకి ఏడాదిపాటు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.