కరోనా ఎఫెక్ట్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా

కోవిడ్‌ సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పట్లో జరపలేమని స్పష్టం చేసింది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీ అవ్వనున్న ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలను తాజాగా వాయిదా వేస్తూ ఈసీ వెల్లడించింది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి ఏపీలో ఈనెల 31న ముగ్గురు ఎమ్మెల్సీలు, తెలంగాణలో వచ్చే నెల 3న ఆరుగురు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు.

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 16 నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తికావస్తున్న సమయంలో అవి ఖాళీకాక ముందే భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణను సమీక్షించినట్లుగా ఈసీ పేర్కొంది. పరిస్థితులు అదుపులోకి వచ్చాక ఎన్నికలు జరిగే తేదీలను ప్రకటిస్తామని ఈసీ వెల్లడించింది.