రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది . ఆదివారం కూడా రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా సాధారణ ప్రజల నుంచి రాజకీయ ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు చాలా మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వరుసగా కరోనా బారిన పడుతన్నారు. తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన భార్య వరంగల్ జడ్పీ ఛైర్పర్సన్ జ్యోతికి కరోనా సోకింది. మిర్చి పంట నష్టాన్ని పరిశీలించేందుకు మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లాలో పర్యటించాగా.. వెంట వీరూ కూడా ఉన్నారు. ఆ తర్వాత వెంకటరమణారెడ్డి, మంత్రి నిరంజన్ రెడ్డితోపాటే హెలికాప్టర్ లో హైదరాబాద్ వెళ్లారు. సాయంత్రం గండ్ర దంపతులకు జ్వరం రావడంతో పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో కోవిడ్ పాజిటివ్ అని తేలింది. తమను కలిసినవారు పరీక్షలు చేయించుకొని జాగ్రత్తలు పాటించాలని సూచించారు గండ్ర దంపతులు.