కరోనా అప్డేట్: 8 వేల మందికి పైగా పాజిటివ్.. 621 మంది మృతి

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో 10,91,236 మందికి కరోనా టెస్టులు చేయగా.. 8,774 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న 9,481 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 3.45 కోట్లకు చేరగా.. వారిలో 3.39 కోట్ల మంది వైరస్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 621 మంది వైరస్ బారిన పడి మరణించగా.. అందులో 554 కేరళ నుంచి వచ్చినవే. ఇప్పటివరకు 4,68,554 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. మరోవైపు నిన్న 82 లక్షల మంది టీకా తీసుకున్నారు. మొత్తంగా 121 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. మరో 4,68,554 మంది మహమ్మారి వల్ల మరణించారు. కాగా, దేశంలో యాక్టివ్‌ కేసులు 543 రోజుల కనిష్టానికి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదిలా ఉండగా.. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మూడో దశలో కరోనా విజృంభిస్తే లక్షలాది మంది తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన నెలకొంది. దీంతో వైరస్‌ వ్యాప్తి భయంతో అనేక దేశాలు కట్టడి చర్యల్ని కఠినంగా అమలు చేస్తున్నాయి. ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిపై గట్టి నిఘాపెట్టి, పాజిటివ్‌గా తేలిన వారిని ఎక్కడిక్కడ క్వారంటైన్‌కు పంపుతున్నాయి. పరీక్షల్ని ముమ్మరం చేశాయి. కొత్త వేరియంట్‌ వెలుగుచూసిన దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా తదితర దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నాయి.