కొవిడ్ రోగులకు భరోసాను ఇవ్వాలి.. మంత్రి హరీష్ రావు

కరోనా కష్ట కాలంలో దవాఖానకు వచ్చే రోగులకు ఇబ్బంది రావొద్దని, బాధ్యతగా పనిచేసి కొవిడ్ రోగులకు భరోసాను ఇవ్వాలని మంత్రి హరీష్ రావు వైద్యాధికారులకు సూచించారు. సిద్దిపేట మెడికల్ కాలేజీలోని కొవిడ్ వార్డులో రోగులకు వసతుల కల్పనపై ఆదివారం ప్రభుత్వ దవాఖానను మంత్రి పరిశీలించారు.

అనంతరం హాస్పిటల్‌లో పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తమిళ్ అరసు, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ జయశ్రీ, మెడికల్ కళాశాల, ఏరియా దవాఖాన అధికారిక సిబ్బందితో మంత్రి సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వృత్తి ధర్మాన్ని, బాధ్యతను మరువొద్దని, ప్రభుత్వ దవాఖాన-మెడికల్ కళాశాల ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. బాధ్యతాయుతంగా పని చేయని వారిపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

దవాఖానకు అవసరమైన అడ్మినిస్ట్రేటివ్- వ్యవస్థపరమైన అంశాలపై గ్యాప్ ఉంటే ఏ రకమైన అవసరం ఉన్నా తన దృష్టికి తేవాలన్నారు. రోగికి వైద్య సిబ్బంది ఆత్మీయ పలకరింపే చాలా ముఖ్యమన్నారు. పేషెంట్లను కుటుంబ సభ్యులు నేరుగా కలిసేందుకు వీలుగా జిల్లా యంత్రాంగంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో వైద్యులు కాశీనాథ్, చందర్, క్రాంతి, మున్సిపల్ చైర్మన్ మంజుల-రాజనర్సు, మున్సిపల్ కౌన్సిలర్లు సాయి, ప్రవీణ్, దీప్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.