త్వరలోనే చిన్నపిల్లలకు కోవిడ్ టీకాలు.. కేంద్ర ఆరోగ్య మంత్రి - TNews Telugu

త్వరలోనే చిన్నపిల్లలకు కోవిడ్ టీకాలు.. కేంద్ర ఆరోగ్య మంత్రి



దేశవ్యాప్తంగా చిన్నపిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ తెలిపారు. ఆగ‌స్టు క‌ల్లా చిన్న‌పిల్ల‌ల‌కు కోవిడ్ టీకాలు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయని అన్నారు. రాజ్య‌స‌భ‌లోనూ పిల్ల‌ల వ్యాక్సినేష‌న్ గురించి ఓ స‌భ్యుడు ప్ర‌శ్నించగా.. విప‌క్ష స‌భ్యుల నినాదాల మ‌ధ్య ఆరోగ్య మంత్రి ఇచ్చిన స‌మాధానం స‌రిగా విన‌ప‌డ‌లేదు. కాగా, ఇవాళ నిర్వహించిన బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో చిన్నపిల్లలకు కోవిడ్ టీకా ఇవ్వడం గురించి ఆయన త‌మ పార్టీ ఎంపీల‌తో చర్చించారు.


ప్ర‌స్తుతం ఇండియాలో రెండు కోవిడ్ టీకాల‌ను పిల్ల‌ల‌పై ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్నారు. 12 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య పిల్ల‌ల‌పై జైడ‌స్ కోవిడ్ టీకా ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించింది. ఇక భార‌త్ బ‌యోటెక్ సంస్థ కూడా 2 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య ఉన్న పిల్ల‌ల‌పై రెండ‌వ‌, మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ రెండు టీకాల ఫ‌లితాల ఆధారంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఉంటుంద‌ని ఇటీవ‌ల లోక్‌స‌భ‌లో కేంద్ర ఆరోగ్య‌శాఖ స‌హాయ మంత్రి భార‌తి ప‌వార్ తెలిపారు.