గోల్కొండ ఆసుపత్రిని సంద‌ర్శించిన సీఎస్ సోమేశ్‌కుమార్‌ - TNews Telugu

గోల్కొండ ఆసుపత్రిని సంద‌ర్శించిన సీఎస్ సోమేశ్‌కుమార్‌సీఎం కేసీఆర్ ఆదేశాల‌ మేరకు సీనియర్ అధికారులతో కలసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇవాళ గోల్కొండ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఇక్కడ నిర్వహిస్తున్న రెండవ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి, రెండవ డోస్ తీసుకొనేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడారు.

ఈ సందర్భంగా గోల్కొండ ఏరియా ఆసుపత్రిలోని వివిధ వార్డులను, అందుబాటులోవున్న వసతులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనిఖీ చేసారు. ఆక్సిజన్ పైప్ లైన్ పనులను ప‌రిశీలించిన ఆయ‌న ప‌నుల‌ను వేగంగా పూర్తి చేయాల‌ని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పడకల సంఖ్యను పెంచుటకు, అదనంగా 120 పడకల ఏర్పాటుకు అనువుగా ఆసుపత్రి పై భాగంలో నిర్మిస్తున్న‌ అంతస్తు ప‌నుల‌ను పురోగ‌తిని అడిగి తెలుసుకున్నారు.

అద‌న‌పు పడకలను వినియోగంలోకి తెచ్చేందుకు అనువుగా అదనపు మానవ వనరులను, ఇతర వసతులను సమకూర్చుటకు ప్రణాళికను రూపొందించాలని వైద్య విద్య డైరెక్టర్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. గోల్కొండ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్.యం.ఒ, ఇతర వైద్యులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. ఈ సమయంలో వారు అందిస్తున్న సేవలను అభినందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేశ్ కుమార్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి, జోనల్ కమీషనర్ ప్రావిణ్య , TSMSIDC MD చంద్రశేఖర్ రెడ్డి, టిఎస్ఐఐసి ఎండి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.