బీజేపీ-ఈటలపై ధ్వజమెత్తిన దళిత నేతలు.. దిష్టిబొమ్మల దగ్ధం

BJP-Eetala-burning-effigies

BJP-Eetala-burning-effigies

బీజేపీ చేసిన ఫిర్యాదుల మేరకు హుజూరాబాద్‌లో దళిత బంధు పథకం అమలును నిలిపివేస్తూ ఎలక్షన్‌ కమిషన్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ తీరు దళితుల నోటికాడ బువ్వ ఎత్తగొట్టినట్టుగా ఉన్నదని దళిత సంఘాల నేతలు, దళిత మేధావులు ధ్వజమెత్తారు.  దళితబంధు నిలిపివేతపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, ఈటల దిష్టిబొమ్మలను తగులబెట్టి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

అబద్ధాల ఈటల.. ఇప్పుడేమంటావ్

దళిత బంధు పథకాన్ని ఆపేయాల్సిందిగా బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ఈసీకి లేఖ రాసినట్టు మొదటినుంచి ఆరోపణలు వచ్చాయి. అయితే తాను లేఖ రాయలేదంటూ ఈటల ఇన్నాళ్లూ చెబుతూ వచ్చారు. అవన్నీ పచ్చి అబద్ధాలని.. హుజూరాబాద్‌ దళితులకు ఆయన వెన్నుపోటు పొడిచారని తాజా పరిణామంతో స్పష్టమైంది.

హుజూరాబాద్‌ కంటే ముందే..

ఉప ఎన్నిక జరిగే హుజూరాబాద్‌ కంటే ముందే ఆగస్టు 4నే వాసాలమర్రిలోనే ఈ పథకం అమలు ప్రారంభమైంది. తర్వాత ఆగస్టు 16న హుజూరాబాద్‌లోనూ, ఆ తర్వాత రాష్ర్టానికి నలువైపులా ఉన్న నాలుగు ఎస్సీ నియోజకవర్గాలోని నాలుగు మండలాల్లో పథకం అమలుకు శ్రీకారం చుట్టింది.

నోటిఫికేషన్ రాకముందే.. నిధులు విడుదల

హుజూరాబాద్‌లో పథకం అమలుకు 2 వేల కోట్ల నిధుల విడుదల ఆగస్టు 26 నాటికి పూర్తయ్యింది. అప్పటికి ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ షెడ్యూలు కూడా విడుదల కాలేదు. ఉప ఎన్నికల్లో ప్రయోజనం కోసమే, ఇప్పుడే హుజూరాబాద్‌లోనే ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు బీజేపీ- ఈటల ఫిర్యాదు చేయడం, దాన్ని ఈసీ ఆమోదించి దళిత బంధును నిలిపివేయడం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు, టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.