రాహుల్‎కి ఏ శాండ్‌విచ్ ఇవ్వాలో చర్చిస్తారు.. కాంగ్రెస్‎పై హర్దిక్ ఘాటు వ్యాఖ్యలు

  • కాంగ్రెస్ పూర్తి కులతత్వ పార్టీ..
  • కాంగ్రెస్‎లో పూర్తిగా అవినీతి జరుగుతోంది
  • ఆ పార్టీ ఇంకా కుటుంబ పార్టీనే
  • విలేకరుల సమావేశంలో పటేల్

కాంగ్రెస్ పార్టీకి బుధవారం రాజీనామా చేసిన గుజరాత్ వర్కింగ్ ప్రెసిడెంట్ హర్దిక్ పటేల్ మరుసటి రోజే ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఒక పెద్ద కులతత్వ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్‌లో గురువారం హర్దిక్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘కాంగ్రెస్ కులతత్వ పార్టీ. నాకు పేరుకే పదవి ఇచ్చారు కానీ, ఎటువంటి బాధ్యతలు కేటాయించలేదు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలు కాగితాలపైనే ఉన్నాయి. రెండేళ్లుగా నాకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు.

కాంగ్రెస్ గురించి హెచ్చరించిన ఆయన పాటిదార్ నేతలకు క్షమాపణలు చెప్పారు. ‘నేను సీనియర్ పాటిదార్ నాయకులు మరియు స్నేహితులకు క్షమాపణలు చెబుతున్నాను. వారు నన్ను కాంగ్రెస్‌లో చేరవద్దని హెచ్చరించారు. వారి మాట విననందుకు ఏంజరిగిందో ఈ రోజు నేను గ్రహించాను’ అన్నారు. రాహుల్ గాంధీ గుజరాత్‌లో పర్యటించినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఒక్క అంశంపై కూడా చర్చ జరగలేదని పటేల్ అన్నారు. రాహుల్ గాంధీ గుజరాత్‎కు వస్తే ఏ చికెన్ శాండ్‌విచ్ ఇవ్వాలో, ఏ డైట్ కోక్ ఇవ్వాలో కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. కుల రాజకీయాలు తప్ప కాంగ్రెస్‎లో మరేమీ లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒక కుటుంబం చుట్టూనే ఉంది.

కాంగ్రెస్‌లో అవినీతి
కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని పాటిదార్ నేత ఆరోపించారు. రాహుల్ గాంధీ దాహోద్ ఆదివాసీ సత్యాగ్రహ ర్యాలీలో దాదాపు 25 వేల మంది హాజరయ్యారని, అయితే 70 వేలకు బిల్లు పెట్టారని, దీన్ని బట్టే కాంగ్రెస్‌లో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

బీజేపీలో చేరడం లేదు
తాను భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరతానన్న వార్తలను హార్దిక్ పటేల్ తోసిపుచ్చారు. బీజేపీలో చేరే విషయమై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విలేకరులతో అన్నారు.