ఈరోజే క్వాలిఫయర్ మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్ ని ఢీకొట్టనున్న కలకత్తా నైట్ రైడర్స్ - TNews Telugu

ఈరోజే క్వాలిఫయర్ మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్ ని ఢీకొట్టనున్న కలకత్తా నైట్ రైడర్స్ఐపీఎల్ 2021 సీజన్ లో అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఈరోజు సాయంత్రం 7:30కి ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్.. కలకత్తా నైట్ రైడర్స్ తలపడనున్న ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే.. వారు ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనున్నారు. ఈ ఐపీఎల్‌ సీజన్ మొత్తంలో అత్యంత నిలకడగా ఆడి, లీగ్‌ దశలో అత్యధిక విజయాలు సాధించి ఫైనల్ వైపు దూసుకెళ్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ తో కలకత్తా నైట్ రైడర్స్ అమీతుమీ తేల్చుకోనున్నారు. రెండు వారాలకు ముందు వరకు కలకత్తా నైట్‌రైడర్స్‌.. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని అడిగితే.. ఏ మాత్రం తడుముకోకుండా అందరూ ఢిల్లీ పేరే చెప్పారు. కానీ.. గత కొద్దిమ్యాచులుగా కసితో ఆడుతూ.. విజయాలు మూటగట్టుకుంటున్న కలకత్తా నైట్ రైడర్స్ తీరు చూస్తుంటే.. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే అనిపిస్తుంది. హోరాహోరిగా సాగనున్న ఈ మ్యాచ్ లో గెలిచి విజయదశమి నాడు జరుగనున్న ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతారు.

DC-vs-KKR Qualifier Match today
DC-vs-KKR Qualifier Match today

ఫైనల్ చేరేది ఎవరు?
తొలి అంచెలో పేలవమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌ రేసులోనే లేదనుకున్న నైట్ రైడర్స్ జట్టు యూఈఏలో కొనసాగుతున్న రెండో అంచెలో దూకుడు పెంచింది. ఆ జట్టు ఆడిన చివరి 8 మ్యాచ్‌ల్లో ఆరు నెగ్గి రెండో క్వాలిఫయర్‌కు సిద్ధమైంది. మరోవైపు జట్టులో అన్నీ విభాగాల్లో బలంగా ఉన్న ఢిల్లీ జట్టు కూడా తక్కువేం లేదు. ఫామ్ లో ఉన్న ఆటగాళ్లు.. సీనియర్లు ఢిల్లీ క్యాపిటల్స్ కి అదనపు బలం. మరి సమవుజ్జీల పోరులా కనిపిస్తున్న ఈ మ్యాచ్‌లో నెగ్గి చెన్నైతో టైటిల్‌ పోరుకు అర్హత సాధించే జట్టేదో చూడాలి. లీగ్‌ దశలో ఫస్ట్ మ్యాచ్ లో ఢిల్లీ నెగ్గగా.. రెండో మ్యాచ్‌లో కోల్‌కతా గెలిచింది. యూఏఈలో రెండో అంచె ఆరంభమైనప్పటి నుంచి కోల్‌కతా రెండోసారి బ్యాటింగ్‌ చేసిన ప్రతిసారీ గెలిచింది. ఢిల్లీ ఈ సీజన్లో ఓడిన అయిదు మ్యాచ్‌లూ మొదట బ్యాటింగ్‌ చేసినప్పటివే.


ఢిల్లీ క్యాపిటల్స్‌:

పంత్‌ (కెప్టెన్‌), ధావన్‌, పృథ్వీ షా, శ్రేయస్‌ అయ్యర్‌, హెట్‌మయర్‌, స్టాయినిస్‌/స్టీవ్‌ స్మిత్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌, నార్జ్‌, రబాడ/టామ్‌ కరన్‌, అవేష్‌ ఖాన్‌.

కలకత్తా నైట్‌రైడర్స్‌:

మోర్గాన్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణా దినేశ్‌ కార్తీక్‌, షకిబ్‌, నరైన్‌, ఫెర్గూసన్‌, మావి, వరుణ్‌ చక్రవర్తి.