పంట మొత్తం కొనాలని డిమాండ్ చేశాం: నామా నాగేశ్వరరావు

Nama-Nageswara-Rao

తెలంగాణలో పంట మొత్తం కొనాలని.. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు.

రెండు నెలల్లో 4,5 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు పంట కొనుగోలు గురించి కేంద్రంతో చర్చించారు. చివరికి చేతులు ఎత్తేసి.. ధాన్యం కొనుగోలు చేయమని చెప్తున్నారు. యాసంగి పంట అసలే కొనం, ఎంత కొంటామో కూడా చెప్పము అంటున్నారు. అఖిల పక్ష భేటీకి హాజరైన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి ఈ విషయాన్ని మరోసారి తీసుకెళ్ళామన్నారు.

ధాన్యం కొనుగోలు అంశాన్ని పార్లమెంట్ లో లెవనెత్తుతాము. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం 37 బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. గతంలో మాదిరిగా బిల్లులు పెట్టి చర్చ లేకుండా పాస్ చేయవద్దని చెప్పాము. పార్లమెంట్ లో ముందు ప్రజా సమస్యలపై చర్చ జరగాలి డిమాండ్ చేసినట్లు ఆయన చెప్పారు.

వ్యవసాయ బిల్లులు రద్దుతో పాటు కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత, స్వామినాథన్ సిఫార్సులు అమలు చేసి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశాం. రైతులపై నమోదైన కేసులు ఎత్తేయాలని సూచించాం. మరణించిన రైతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ 3 లక్షలు ఇచ్చారు. ఇదే అంశంలో కేంద్రం కూడా ముందుకు రావాలని డిమాండ్ చేశాం. మా ప్రతిపాదనకు అన్ని పార్టీల నేతలు మద్దతు తెలిపారని ఆయన వివరించారు.

ఓ పక్క వ్యవసాయ చట్టాల బిల్లులను వెనక్కు తీసుకుంటూనే మళ్ళీ విద్యుత్ బిల్లు పెట్టారు. దేశంలో రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. కృష్ణా జలాల అంశంలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. విభజన చట్టంలోని హామీలు అన్ని నెరవేర్చాలి. ఎస్సి, ఎస్టీ బిల్లు అని యూపీ కి సంబంధించిన అంశాల మీద బిల్లు పెట్టారు. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన ఎలాంటి స్పందన లేదు. రైతుల అంశాలపై సభ లోపల, బయట పోరాడుతామన్నారు.