విద్యుత్ సరఫరా పేరుతొ వచ్చే మోసపూరిత మెస్సేజ్/ ఫోన్ కాల్స్ ని నమ్మొద్దు - TNews Telugu

విద్యుత్ సరఫరా పేరుతొ వచ్చే మోసపూరిత మెస్సేజ్/ ఫోన్ కాల్స్ ని నమ్మొద్దు



విద్యుత్ సరఫరా పేరుతొ వచ్చే మోసపూరిత మెస్సేజ్/ ఫోన్ కాల్స్ ని నమ్మొద్దని సంస్థ సీఎండీ  జి రఘుమా రెడ్డి అన్నారు. విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల బకాయిలు ఉండటం మూలంగా రాత్రి 10.30 తరవాత విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని, అలా విద్యుత్ సరఫరా నిలివేయకుండా ఉండేందుకు, బిల్లుల చెల్లింపు కోసం విద్యుత్ అధికారికి 9692848762 నెంబర్ కు కాల్ చేయగలరనే మోసపూరిత మెసేజ్ లు పంపి విద్యుత్ వినియోగదారులను మోసగిస్తున్నారని సంస్థ దృష్టికి వచ్చిందన్నారు.

విద్యుత్ బిల్లుల చెల్లింపు పేరుతొ కొంత మంది వ్యక్తులు వినియోగదారులను మోసపూరితంగా బెదిరించి వారి బ్యాంకు అకౌంట్, డెబిట్ కార్డు వివరాలు తీసుకుని వారి అకౌంట్ల నుండి నగదును విత్ డ్రా  చేసుకుని మోసం చేసిన దాఖలాలు గతంలో కూడా కూడా వున్నాయన్నారు.

ఒక వేళ ఎవరైనా వ్యక్తులు తమకు ఫోన్ చేసి గాని/ మెసేజ్ ద్వారా గాని విద్యుత్ బిల్లు పెండింగ్ లో వున్నది అని పేర్కొంటే తాము చెల్లించిన వివరాలను సంస్థ వెబ్ సైట్ www.tssouthernpower.com .. TSSPDCL మొబైల్ ఆప్ లో సరి చూసుకోవాలని సూచించారు.

రాత్రిపూట/అర్ధరాత్రి పూట విద్యుత్ సరఫరా నిలిపివేయడం సంస్థ చేయదని ఆయన స్పష్టం చేశారు. పెండింగ్ బిల్లుల పేరుతో విద్యుత్ సరఫరా నిలిపివేత అనే మెసేజ్ లకు స్పందిచవద్దని, వెంటనే పోలీస్ శాఖ వారికి  ఫిర్యాదు చేయాలని రఘుమా రెడ్డి సూచించారు.