రోజంతా కంప్యూటర్ ముందే కూర్చుంటున్నారా? అయితే జాగ్రత్త..

ప్రస్తుత రోజుల్లో విధులలో భాగంగా రోజులో సగం కంప్యూటర్ ముందే గడిచిపోతోంది. ఉద్యోగం రాకముందు ఉద్యోగం కోసం, ఉద్యోగం వచ్చిన తర్వాత కంపెనీ కోసం గంటల తరబడి స్క్రీన్ ముందే గడపాల్సి వస్తోంది. దాంతో రోజు గంటల కొద్దీ కుర్చీలకు అతుక్కుపోయి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇలా గంటల కొద్దీ కుర్చీలకు అతుక్కుపోవడం వల్ల మనకు తేలియకుండానే నడుంపై, కళ్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఒక్కోసారి వెన్నుముక డిస్కుల్లో మార్పులు కూడా వస్తుంటాయి. వెన్నుముక మధ్యలో నుంచి అనేక నాడులు మెదడుకు అనుసంధానం చేయబడి ఉంటాయి. వెన్నుముక కదలిక వలన ఆ నాడుల్లో ఇబ్బందులు వస్తాయి. ఫలితం వెన్నునొప్పి, మెడభాగంపై భారం పడుతుంది. కరోనా వల్ల ఈ మధ్య వర్క్ ఫ్రం హోం ఎక్కువైంది. అయితే ఇంట్లో నుంచే పని చేయడం వల్ల ఒంటరిగా ఉండటంతో.. అప్పుడప్పుడు బోర్ కొట్టి ఏ సినిమానో, వెబ్ సీరిస్ పెట్టుకొని చూస్తుంటారు. దీని వల్ల మళ్లీ కంప్యూటర్ స్క్రీన్ చూడటం వల్ల కళ్లు మరింత దెబ్బతింటాయి.

ఇలా నడుంపై ఒత్తిడి ఏర్పడినపుడు ఎక్కువసేపు కూర్చోలేని పరిస్థితి వస్తోంది. అంతేకాకుండా.. నడుం నొప్పి కారణంగా గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు ఇటీవల పరిశోధనలో తేలింది. రోజువారీ పనుల్లో భాగంగా వచ్చే వెన్ను నొప్పుల నుంచి బయటపడాలి అంటే అందుకు తగిన వ్యాయామాలు చేయాలి. ఆ వ్యాయామాలలో ముఖ్యమైనది యోగా. రోజు కొన్ని రకాల యోగాసనాలు వేయడం వలన ఈ నడుం నొప్పిని జయించవచ్చు. అయితే యోగాసనాలు వేసే ముందు తప్పనిసరిగా వార్మప్ చేయడం అవసరం. అప్పుడే శరీరం యోగ చేయడానికి అనుకూలంగా మారుతుంది.

యోగా మ్యాట్ పై వెళ్లికలా పడుకొని కాళ్ళను ముడిచి గుండెలకు తాకే విధంగా ఆసనాలు వేయాలి. ఇలా ఓ రెండు నుంచి మూడు నిమిషాలపాటు చేయాలి. తరువాత రెండు చేతులు రెండు కాళ్లపై సింహం ఆకారంలో కూర్చొని మెల్లిగా శ్వాసను పీల్చి వదలాలి.. ఇలా చేయడం వలన ఊపిరితిత్తులు విశాలంగా మారతాయి. అంతేకాదు.. శ్వాసనాళాలు క్లీన్ అయ్యి ఊపిరితిత్తులు ఆరోగ్యకరంగా మారతాయి. ఫలితంగా వెన్నునొప్పి నుంచి క్రమంగా బయటపడొచ్చు. ఆఫీసులో ప్రతి గంటకు ఒకసారి ఇలాంటి ఆసనం వేస్తే.. నడుం నొప్పి నుంచి తొందరగా బయటపడొచ్చు.

గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల స్క్రీన్ నుంచి వచ్చే నీలి కాంతి మన కళ్ళపై ప్రభావం చూపుతుంది. అందుకే ప్రతీ ఇరవై నిమిషాలకి ఒకసారి కంప్యూటర్ తెర మీద నుండి పక్కకి తిరిగి కొంత దూరంలో ఉన్న వస్తువు వైపు ఓ 20 సెకన్లపాటు కనురెప్పలు కొడుతూ చూడాలి. దీనివల్ల కళ్ళలో నీళ్ళు ఉత్పత్తి అవుతాయి. ఎక్కువ సేపు ఒకే తెరని చూడడం వల్ల కళ్ళలో తడి తగ్గిపోతుంది. అది తగ్గిపోతే కంటి సమస్యలు వస్తాయి. అందుకే ఇలా ప్రతీ ఇరవై నిమిషాలకి ఒకసారి చేయాలి. అదేవిధంగా కుర్చీలోంచి లేచి కొద్ది సేపు నడవాలి. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వచ్చే నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు. ఫోన్‌లో మాట్లాడేటప్పుడు కూడా అటూఇటూ నడుస్తూ మాట్లాడటం మంచిది. లంచ్, స్నాక్స్‌, కూర్చున్నచోటే తినకుండా వేరేచోటుకి వెళ్లి తింటే మంచిది. ఎక్కువసేపు కూచోవటం వల్ల హైబీపీ, కొలెస్ట్రాల్‌ స్థాయులూ పెరుగుతాయి. కాబట్టి వీటన్నింటిని కంట్రోల్‎లో ఉంచుకోవాలంటే కొంతైనా వ్యాయామం చేయడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు.