ఐపీఎల్ 2022.. లక్నో ఫ్రాంచైజీ.. కొత్త పేరేంటో తెలుసా?

Lucknow-franchise

ఐపీఎల్‌లో కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. అధికారికంగా జట్టు పేరును ప్రకటించింది. ‘లక్నో సూపర్‌ జెయింట్స్‌’ పేరును ఖరారు చేసినట్లు గొయెంకా గ్రూప్‌ చైర్మన్‌, లక్నో ఫ్రాంచైజీ యజమాని డాక్టర్‌ సంజీవ్‌ గొయెంక ప్రకటించారు.

లక్నో ఫ్రాంచైజీకి పేరు పెట్టేందుకు ‘నామ్‌ బనావో.. ఔర్‌ నామ్‌ కామావో’ సోషల్‌ మీడియాలో గొయెంకా గ్రూప్‌ పోటీని నిర్వహించింది. లక్షలాది మంది వివిధ పేర్లు సూచించగా.. చివరకు జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్‌’ పేరును ఖరారు చేశారు.

ఈ ఏడాది ఐపీఎల్‌ లో పది జట్లు పాల్గొననున్నాయి. గత ఏడాది అక్టోబర్‌ 25న ఐపీఎల్‌ కోసం బీసీసీఐ రెండు కొత్త జట్లను ప్రకటించింది. లక్నోను ఆర్‌పీఎస్‌జీ వెంచర్స్‌ లిమిటెడ్‌ రూ.7090కోట్లకు, అహ్మదాబాద్‌ జట్టును రూ.5626కోట్లకు సీవీసీ క్యాపిటల్‌ దక్కించుకుంది.

ఈ సీజన్‌కు సంబంధించి మెగా వేలం ఫిబ్రవరి నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో జరుగనున్న విషయం తెలిసిందే. లక్నో ఫ్రాంచైజీ కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా, ఆల్‌ రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌, భారత అన్‌క్యాప్డ్‌ లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌లను తీసుకుంది. అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీ ఆల్‌రౌండర్‌ హర్దిక్‌ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. ఆఫ్ఘన్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌, భారత ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ను కొనుగోలు చేసింది.