మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తింటారో తెలుసా?

ఈ రోజు మృగశిర కార్తె. తెలంగాణ యావత్తు మృగశిర కార్తెను పండుగలా జరుపుకుంటారు. ఈ రోజు రైతులు శభముహుర్తంగా భావించి తమ వ్యవసాయ పనులు మొదలుపెడతారు. అదేవిధంగా ఈ కార్తె ప్రారంభం రోజు చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటివరకు ఉన్న రోహిణి కార్తె రోళ్లు పగిలే ఎండలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే నేటి నుంచి మొదలవుతున్న మృగశిర రాష్ట్రంలోకి బుతుపవనాలను తీసుకురానుంది.

జూన్‌ మొదటి వారంలో వచ్చే మృగశిర కార్తె అంటే గ్రామీణ ప్రాంతాల్లో పండుగలాంటింది. అందుకే ఊళ్లలో చేపలు, నాటు కోడి కూర తినడానికి మక్కువ చూపుతారు. ఇన్నాళ్లూ వేసవి వల్ల ఉక్కపోతతో సతమతమైన పల్లెలు, పట్టణ వాసులు మృగశిర కార్తెలో కురిసే తొలకరి జల్లులతో వేసవి తాపం తగ్గుతుందని ప్రజలు నమ్ముతారు. వాతావరణం ఒక్కసారి చల్లబడటం, ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకునే క్రమంలో వ్యాధులు సంక్రమిస్తుంటాయి. అంతేకాకుండా మానవునిలో రోగ నిరోధక శక్తి తగ్గి జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ వ్యాధులు వస్తుంటాయి. వీటన్నింటిని తట్టుకోవాలంటే శరీరంలో కాస్త వేడి ఉండాలి. అందుకే మృగశిర కార్తె రోజు చేపలు తింటుంటారు. గుండె జబ్బులు, ఆస్తమా, మధుమేహ వ్యాధి ఉన్న వారు, గర్భిణులు ఈ సమయంలో చేపలు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ సీజన్‌లో చాలా మందికి జీర్ణశక్తితోపాటు రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంటుంది. జ్వరం, దగ్గు లాంటి వాటి బారినపడతారు. ఇలాంటి వాటి నుంచి గట్టెక్కాలంటే చేపలు తినడమే మంచిదని భావిస్తుంటారు.