గుమ్మానికి నిమ్మకాయ, మిర్చి ఎందుకు కడుతారో తెలుసా? - TNews Telugu

గుమ్మానికి నిమ్మకాయ, మిర్చి ఎందుకు కడుతారో తెలుసా?మనదేశంలో పాటించే సంస్కృతి, సంప్రదాయాలు అన్నీ ఇన్నీ కావు. నిత్యం ఎన్నో ఆచారాలు పాటించడం భారతీయుల జీవన విధానంలోనే భాగంగా ఉంది. అయితే.. కొన్ని కొన్ని సాంప్రదాయాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం. కొన్ని ఆచారాలు మాత్రం దేశమంతటా ఒకేలా ఉంటాయి. అయితే.. మనం పాటించే ఆచారాలు, సంప్రదాయాల అర్థాలు అన్నీ తెలియాలని లేదు. కొన్ని తెలిసి ఉండొచ్చు.. కొన్ని తెలియకపోవచ్చు. అయితే.. ఇండియాలో చాలామంది పాటించే ఆచారాల్లో గుమ్మానికి నిమ్మకాయ, మిరపకాయ కట్టి వేలాడదీయడం. ఇలా ఎందుకు కడుతారో ఇప్పుడు తెలుసుకుందాం.


గుమ్మానికి నిమ్మకాయలు, మిరపకాయలు కట్టి వేలాడదీయడం వల్ల దుష్టశక్తులు, ఆత్మలు ఇంట్లోకి రావు అని ఒక నమ్మకం ప్రచారంలో ఉంది. అయితే.. దీని వెనుక సైన్స్ కూడా ఉందనేది ఒక వాస్తవం. పూర్వం చాలామంది మట్టితో అలకిన ఇండ్లలో ఉండేవారు. ఇప్పటిలా అప్పుడు టైల్స్, బండలు లేవు. దీంతో ఇంట్లో చిన్నచిన్న పురుగులు, దోమలు ఈగలు ఇంట్లో ఎక్కువగా ఉండేవి. ఆరోజుల్లో మస్కిటో కాయిల్స్, ఆలౌట్ లాంటివి ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో.. నిమ్మకాయ, మిరపకాయలు కలిపి ఇంట్లో గుమ్మానికో.. లేదంటే దూలానికో కట్టేవారు.


నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ దోమలు, ఈగలు, ఇతర కీటకాలు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. నిమ్మకాయను దారానికి కట్టి గుచ్చడం వల్ల నిమ్మకాయలోని సిట్రస్ యాసిడ్ వాసన బయటకు వీస్తూ పురుగులు రాకుండా అడ్డుకునేది. మిరపకాయలోని ఘాటు కూడా పురుగులు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అందుకే వాటిని గుమ్మానికి ఎదురుగా కట్టేవారు.

పూర్వకాలం నుంచి ఈ ఆచారాన్ని మన పెద్దలు పాటిస్తుండటంతో ఇప్పటికీ మనం ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్నాం. దాంట్లో సైన్స్ తో పాటు.. ఆచారం కూడా ఉండటంతో ఆ పద్ధతి పాటించవద్దని చెప్పడానికి ఎలాంటి అడ్డంకులు లేవు.