శునకానందం.. పెట్ డాగ్‎కు బర్త్ డే.. 5 వేల మందికి భోజనాలు

ఇంట్లో పిల్లల బర్త్ డే అంటే హడావుడి అంతాఇంతా ఉండదు. చుట్టాలు, స్నేహితులు అందరినీ పిలిచి కేక్ కట్ చేసి, వారికి మంచి భోజనం పెట్టి పంపిస్తాం. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి కూడా బర్త్ డేకు ఇలాగే చేశాడు. కానీ, బర్త్ డే ఆయన పిల్లలది కాదు, ఆయన పెంచుకుంటున్న పెంపుడు కుక్కది. బెళగావి జిల్లా తుక్కనట్టి గ్రామానికి చెందిన శివప్ప మర్డి తన పెంపుడు శునకం క్రిష్‌ను ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్నాడు. ఇటీవల క్రిష్ బర్త్ డే వేడుకలు కూడా నిర్వహించాడు. దాంతో ఆయన సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. క్రిష్ బర్త్ డే సందర్భంగా గ్రామంలోని 5 వేల మందికి భోజనాలు ఏర్పాటుచేశాడు. భోజనం అంటే అలా ఇలా కాదు.. ఏకంగా నాన్ వెజ్, వెజ్ వంటకాలు చేయించాడు. బర్త్ డే సందర్భంగా 100 కిలోల కేక్, 300 కేజీల చికెన్, ఉడకబెట్టిన గుడ్లు, 50 కేజీల వెజిటేరియన్ ఫుడ్ తయారు చేయించాడు.

గతంలో మర్డి గ్రామ పంచాయతీ సభ్యుడిగా పనిచేశాడు. ఆ సమయంలో ఆయన కుక్కలా ప్రజా ధనాన్ని తిన్నారని ప్రస్తుత పంచాయతీ సభ్యులు ఆరోపించారు. దాంతో వారికి గట్టి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే మర్డి.. తన పెంపుడు కుక్క అయిన క్రిష్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించాడని స్థానికులు చెబుతున్నారు.