పంటపొలాల్లో ఎలుగుబంటి.. వెంబడించి తరిమిన శునకాలు

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. మండలంలోని అంతర్గామా గ్రామ శివారు పంటపొలాల్లో సోమవారం ఉదయం ఎలుగుబంటి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన స్థానికులు వాగు వద్ద మొదట ఎలుగుబంటిని చూసి భయంతో పరుగులు తీశారు. ఆ తర్వాత తేరుకొని ఎలుగుబంటిని తరిమెందుకు ప్రయత్నించారు.

మరోవైపు స్థానికంగా ఉన్న శునకాలు ఎలుగుబంటిని చూసి మొరగడంతో ఎలుగుబంటి వెనుతిరిగింది. పలు శునకాలు ఎలుగుబంటి వెంటపడి తరిమాయి. గ్రామ పొలిమేర దాటే వరకు శునకాలు ఎలుగుబంటిని వెంబడించి తరమడంతో పాటు స్థానికుల అరుపులతో ఎలుగుబంటి అటవీ ప్రాంతంలో తిరిగి వెళ్లిపోయింది. దింతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకొన్నారు.