ఏడాదిలోపు పిల్లలకు ఈ ఫుడ్ అస్సలు పెట్టకండి.. ఈ ఇబ్బందులు తప్పవు

ఇప్పుడిప్పుడే పాలు మానేసి ఉగ్గు, మెత్తటి పదార్థాలకు అలవాటు పడుతున్న ఏడాది లోపు పిల్లలకు ఏం తినిపించాలి. చాలామంది పిల్లలు తింటున్నారు కదా అని అత్యుత్సాహంతో ఏవేవో తినిపిస్తుంటారు. అయితే అలా చేయొద్దని హెచ్చరిస్తున్నారు పిల్లల వైద్య నిపుణులు. పిల్లలకు పోషక పదార్థాలు ఇవ్వడం ముఖ్యమే. కానీ.. ఏది పడితే అది తినిపిస్తే చిన్ని పొట్టకు తిప్పలు తప్పవు. ఇంతకీ ఏడాది లోపు పిల్లలకు ఏయే ఫుడ్ పదార్థాలు తినిపించకూడదో ఓ లుక్కేద్దామా!


సంవత్సరంలోపు పిల్లలకు అన్నప్రాశన తర్వాత చాలామంది తల్లిదండ్రులు తమ వీలును బట్టి కొత్త రుచులను తినిపిస్తుంటారు. అయితే కొన్నిరకాల రుచులు, ఆహార పదార్థాలు సంవత్సరం లోపు పిల్లలకు పెట్టకపోవడమే మంచిదంటున్నారు పిల్లల ఆహార నిపుణులు.


తేనె రుచి అసలే వద్దు
చాలామంది తల్లిదండ్రులు అప్పుడే పుట్టిన పిల్లలకు తేనె నాకిస్తుంటారు. పిల్లలకు అది ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు. ఏడాదిలోపు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో తేనె పెట్టకూడదని సూచిస్తున్నారు. ఎందుకంటే తేనెలో కంటికి కనిపించని బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి చిన్నారుల్లో విషపూరిత కణాలను పెంచుతాయి.


ఆవుపాలు అరగవు..
తల్లికి పాలు రాకపోతే చాలామంది పిల్లలకు ఆవుపాలు తాగిస్తుంటారు. కానీ ఇది పిల్లల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఆవుపాలు జీర్ణం కావాలంటే పెద్దలకే చాలా సమయం పడుతుంది. అలాంటిది చిన్నారులకు ఆవుపాలు అసలే అరగవు. ఇందులో పిల్లల ఎదుగుదలకు అవసరమయ్యే ఉండే ఐరన్, విటమిన్ ‘ఈ’ ఉండవు.


పండ్ల రసాలు
కొంతమంది పిల్లలకు తల్లిపాలు మరిపించేందుకు, ఆకలి తగ్గేందుకు పండ్లరసాలు తాగిస్తుంటారు. అయితే.. పండ్లరసాల్లో అధిక మోతాదులో ఉండే చక్కెర స్థాయిలు పిల్లల్లో డయేరియాకు కారణమవుతాయి. అంతేకాదు.. పండ్లరసాల్లోని ఆమ్లాల వల్ల చిన్నారి పొట్టలో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి.


ధాన్యాలు, కాల్చిన ఐటమ్స్ పెట్టకండి
జీర్ణవ్యవస్థ ఇంకా పూర్తిగా సిద్ధం కాని ఏడాది లోపు పిల్లలకు ధాన్యాలు, కాల్చిన ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దంటున్నారు పోషకాహార నిపుణులు. పాశ్చరైజ్ చేయని ఆహార పదార్థాల వల్ల పిల్లల ప్రాణాలకే ప్రమాదం సంభవించవచ్చని హెచ్చరిస్తున్నారు. కాల్చిన ఆహార పదార్థాల వల్ల అందులోని రసాయనాలు, సోడియం పిల్లల జీర్ణ వ్యవస్థ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి.