‘ఒమిక్రాన్‌’పై ఆందోళన వద్దు: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

Health Director Srinivasa Rao and dme ramesh reddy

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. కరోనా పరిస్థితులు, కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై, ప్రభుత్వ సన్నద్ధతపై రెండు గంటల పాటు హెల్త్ మినిస్టర్ హరీష్ రావు అధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేష్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కొవిడ్‌ నియంత్రణకు ఆరోగ్య శాఖ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుందని, కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో కేసుల పెరుగుదల నిలకడగానే ఉందన్నారు. ఇప్పటివరకు దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాలేదన్నారు.

కొత్త వేరియంట్ దేశంలోకి రాకుండా విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ జరుగుతోందన్నారు. మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామన్నారు. గత నాలుగైదు నెలలుగా రాష్ట్రంలో 200 లోపే కొవిడ్‌ కేసులు నమోదు అవుతున్నాయని వారు చెప్పారు.

రాష్ట్రంలో 90 శాతం మొదటి డోసు,  45 శాతం రెండో డోసు ఇచ్చామని, రెండో డోసును టైమ్  అయినా 25 లక్షల మంది తీసుకోలేదని వారు చెప్పారు. ఏ వేరియంట్‌ను అయినా ఎదుర్కోవడం మన చేతుల్లోనే ఉందని, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం లాంటివి మర్చిపోవద్దన్నారు.

సాధారణంగా వైరస్ లలో ఉత్పరివర్తనాలు చాలా జరుగుతాయని, కరోనా కొత్తరకం వేరియంట్ ఎంత ప్రమాదకరం అనే దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా జాగ్రత్తలు పాటించాలని వెల్లడించారు.