ఆ ఖైదీకి బెయిల్ మంజూరు చేయండి.. మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు సుప్రీం సూచన

Drugs Case Accused Wishing To Donate Kidney Gets Relief From Supreme Court

Drugs Case Accused Wishing To Donate Kidney Gets Relief From Supreme Court

డ్రగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుడికి ఓ కీలక సందర్భంలో బెయిల్ ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. తన తండ్రి అనారోగ్యంతో ఉన్నాడని, ఆయనకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్స చేయాలని సుప్రీంకోర్టుకు నిందితుడు తెలియజేయగా.. ధర్మాసనం అందుకు అంగీకరించింది. కిడ్నీ చేయడానికి ఆరోగ్యకరంగా ఉన్నాడని డాక్టర్ల బృందం భావిస్తే తాత్కాలిక బెయిల్‌ కోసం ఆయన మధ్యప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. ఈ బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు సానుభూతితో పరిశీలించాలని జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ జె.కె.మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం తెలిపింది.

తొలుత నిందితునికి బెయిల్‌ ఇవ్వడానికి మధ్య ప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. నేరం తీవ్రత దృష్ట్యా బెయిల్‌ ఇవ్వకూడదని ప్రభుత్వం కూడా వాదించింది. అనారోగ్యానికి గురయిన తండ్రిని చూసుకోవడానికి ఇతర సోదరులు, బంధువులు ఉన్నారని తెలిపింది. అయితే ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘‘తండ్రిని చూసుకోవడం వేరు..మూత్రపిండాన్ని దానం చేయడం వేరు.. కిడ్నీ ఇవ్వడానికి ఇతర కుమారులు, వారి భార్యలు, పిల్లలు అంగీకరించకపోవచ్చు. దానం చేయడానికి నిందితుడు ముందుకు వస్తున్నందున అందుకోసం ఆయనకు తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంది’’ అని తెలిపింది. ఆయనపై ఉన్న కేసును ఆరు నెలల్లోగా పరిష్కరించాలని ట్రయల్‌ కోర్టుకు సూచించింది.