పరిగడుపున టేబుల్ స్పూన్ నువ్వులు తినండి… ఆరోగ్యానికి ఎంతో మేలండి

భారతీయ వంటింటిలో కొన్ని తరాల నుంచి నువ్వులను చాలా రకాలుగా వాడుతున్నారు. నువ్వుల పొడి, నువ్వు ఉండలు మనకి తెలిసినవే. ఆయుర్వేదంలో కూడా నువ్వులకి ప్రత్యేక స్థానముంది. రోజువారీ వంటలో కొన్ని నువ్వులు చేర్చితే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. నువ్వుల వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లను నువ్వులు అందిస్తాయి. అందుకే.. పరిగడుపునే టేబుల్ స్పూన్ నువ్వులు తినాలని సూచిస్తున్నారు న్యూట్రిషియన్లు. అలా చేయడం వల్ల చాలా లాభాలున్నాయి. 

సైజులో చిన్నగా కనిపించే ఈ గింజల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రపంచంలోని అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాల్లో నువ్వులు ఒకటి. నువ్వులను కొద్దిగా వేయించి ఆహారంలో చేర్చుకుంటే చాలా రుచిగా ఉంటుంది. దీన్ని పచ్చిగా కూడా తినవచ్చు.

నల్లనువ్వుల కంటే తెల్ల నువ్వులలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అయితే తెల్లనువ్వుల కంటే నల్ల నువ్వులు మంచి సువాసనను కలిగి ఉంటాయి. తెల్లనువ్వుల కంటే నల్ల నువ్వుల్లో కాల్షియం 60% లభిస్తుంది. నువ్వుల్లో శరీరానికి అతి ముఖ్యమైన ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, డైటరీ ఫైబర్ వంటి ఫైటో న్యూట్రియెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనత నుండి త్వరగా బయటపడాలంటే రోజూ నువ్వులను తినండి.

 

అధిక ప్రోటీన్

నువ్వుల్లో డైటరీ ప్రొటీన్‌తో పాటు నాణ్యమైన అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ప్రొటీన్ డైట్ పాటించే వారికి ఇది బెస్ట్ ఫుడ్. సలాడ్లు ఇతర ఆహార పదార్థాలపై నువ్వులు చల్లుకోవచ్చు. రోజూ ఒక చెంచా నువ్వులు తినండి.

మధుమేహం

నువ్వులలో మెగ్నీషియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నువ్వులు, నువ్వుల నూనె మధుమేహాన్ని నివారిస్తాయని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇది హైపర్‌సెన్సిటివిటీ మధుమేహం ఉన్నవారి శరీరంలోకి ప్లాస్మా గ్లూకోజ్‌ని తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది.

రక్తపోటు

నువ్వులు, మధుమేహాన్ని లింక్ చేసి నిర్వహించినన అధ్యయనాల్లో కూడా ఈ నువ్వులు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయని తేలింది. ఎందుకంటే నువ్వుల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడే ప్రధాన పోషకం.

కొలెస్ట్రాల్

శరీరంలోని అధిక కొవ్వును తగ్గించడంలో నువ్వులు సహాయపడతాయి. ఇందులోని ఫైటోస్టెరాల్స్ కొలెస్ట్రాల్ ఉత్పత్తిని నిరోధిస్తాయి. ముఖ్యంగా నల్ల నువ్వులలో ఫైటోస్టెరాల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు నల్ల నువ్వులు తినడం చాలా మంచిది.

జీర్ణక్రియ

నువ్వులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రోజూ ఒక చెంచా నువ్వులను తినడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. పేగుల్లోని వ్యర్థ పదార్థాలు సక్రమంగా బయటకు వెళ్లిపోతాయి.

ఆరోగ్యకరమైన చర్మం

నువ్వులలో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మతత్వాన్ని కాపాడే కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. చర్మ కణజాలాలను పునరుత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. మీ చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే, మీ రోజువారీ ఆహారంలో నువ్వులు, నువ్వుల నూనెను చేర్చుకోండి. నువ్వులు తరచూ తినడం వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే  ప్రమాదాన్ని తగ్గించవచ్చు. నువ్వులు సూర్యుడి నుండి వచ్చే హానికరమైన UV కిరణాల వల్ల చర్మం దెబ్బతినకుండా నివారిస్తుంది మరియు చర్మంపై ముడతలు మరియు నల్లటి వలయాలను నివారిస్తుంది. కాబట్టి యవ్వనాన్ని నిలుపుకోవాలనుకునే వారు రోజూ నువ్వులను తినండి.

గుండె ఆరోగ్యం

నువ్వుల నూనె గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన నువ్వులు ధమనులలో అడ్డంకులు ఏర్పడకుండా నిరోధించి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.

క్యాన్సర్

నువ్వుల్లో ఫైటిక్ యాసిడ్, మెగ్నీషియం,  ఫైటోస్టెరాల్స్ వంటి క్యాన్సర్ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజూ నువ్వులు తింటే క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

డిప్రెషన్..  టెన్షన్

మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు నువ్వులలో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులోని థయామిన్, ట్రిప్టోఫాన్ వంటి మనశ్శాంతిని పెంచే విటమిన్లు కూడా ఉన్నాయి. ఇవి శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తికి సహాయపడతాయి, శారీరక నొప్పి, ఒత్తిడి, నిరాశ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. బాగా నిద్రపోవడానికి సహకరిస్తాయి. 

డీఎన్ఏ కణాలను కాపాడుతుంది..

రేడియేషన్ వల్ల కలిగే డీఎన్ఏ దెబ్బతినకుండా కాపాడటంలో నువ్వులు ఎల్లప్పుడు ముందుంటాయి. కాబట్టి రోజూ ఒక స్పూన్ నువ్వులను ఖాళీ కడుపుతో తినడం అలవాటు చేసుకోండి.

ఆర్థరైటిస్

ప్రస్తుతం చాలా మంది కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు. రోజూ నువ్వులు తింటే కీళ్లనొప్పులకు చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే నువ్వుల్లోని కాపర్ కీళ్లనొప్పుల సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎముకలు, కీళ్లు, రక్తనాళాలను బలోపేతం చేస్తుంది.

కాలేయం పనితీరు మెరుగు

ఆల్కహాల్ అలవాటు ఉన్నవారిలో కాలేయం పనితీరు మందగిస్తుంది. అలాంటి వారు రోజూ నువ్వులను తీసుకుంటే.. కాలేయం దెబ్బతినకుండా కాపాడుతుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.

ఎముకల దృఢత్వానికి

గుప్పెడు నువ్వుల గింజల్లో ఒక గ్లాసెడు పాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. నువ్వులలోని జింక్ ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తుంది. ఎముకలకు సంబంధించిన సమస్యలను నివారించడానికి, రోజూ ఒక చెంచా నువ్వులను తినండి.

పిల్లల ఆరోగ్యం

నువ్వుల నూనెలతో పిల్లలకు మసాజ్ చేయడం వల్ల వారి ఎదుగుదల బాగుంటుంది. నువ్వుల నూనెతో మర్దన చేస్తే పిల్లలు బాగా నిద్రపోతారు. డైపర్ రాషెస్ వంటి సమస్యల నుంచి పిల్లలకు ఉఫశమనం కలిగిస్తుంది.

నోటి సమస్యలకు చెక్

ఆయుర్వేదం ప్రకారం, నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సిఫార్సు చేయబడిన మార్గాలలో ఆయిల్ పుల్లింగ్ ఒకటి. నువ్వుల నూనెతో చేసిన ఆయిల్ పుల్లింగ్ వల్ల దంతాలపై ఏర్పడిన పసుపు మరకలు తొలగిపోతాయి. పంటినొప్పి వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. నోటి దుర్వాసనకు నువ్వుల నూనెతో చెక్ పెట్టొచ్చు.

శ్వాసకోశ ఆరోగ్యం

నువ్వులలోని అధిక మెగ్నీషియం ఆస్తమా మరియు ఇతర సమస్యల వంటి శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది. కాబట్టి ఆస్తమా ఉన్నవారు రోజూ ఉదయం ఖాళీ కడుపుతో నువ్వులను తింటే ఆస్తమా సమస్య నుంచి నెమ్మదిగా కోలుకోవచ్చు.