కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై ఈసీ అనర్హత వేటు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత బలరాం నాయక్‌పై కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. చట్టసభల ఎన్నికల్లో మూడేళ్ల పాటు పోటీ చేయకుండా ఆయనపై నిషేధం విధించింది. దీంతో ఆయన వచ్చే మూడేండ్లపాటు పార్లమెంట్‌ ఉభయసభలకు, శాసనసభ, శాసన మండలికి పోటీ చేసే అర్హతను కోల్పోయారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పోటీ చేసిన బలరాం నాయక్‌.. నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయం వివరాలను ఈసీకి సమర్పించకపోవడంతో ఆయనపై అనర్హతా వేటు పడింది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.

‘‘అన్ని రకాల పేపర్లను ఎన్నికల కమిషన్‌కు అందించా. కానీ, సరైన పత్రాలు ఇయ్యలేదని ఈసీ నాపై అనర్హత వేటు వేసింది. నా వద్ద అన్ని రకాల పేపర్లు ఉన్నాయి. ఈసీకి నేరుగా లేదా కోర్టు ద్వారా మళ్లీ పేపర్లను పంపిస్తాను. కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందొద్దు.’’ అని బలరామ్‌నాయక్‌ ఈసీ అనర్హత వేటుపై స్పందించారు.

బలరాం నాయక్‌తోపాటు మహబూబాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి వెంకటేశ్వరరావు, నల్గొండ నుంచి పోటీ చేసిన బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థి వెంకటేశ్, స్వతంత్ర అభ్యర్థి రొయ్యల శ్రీనివాసులు, మెదక్ నుంచి శివసేన తరఫున పోటీ చేసిన హన్మంతరెడ్డిలపై కూడా ఈసీ అనర్హత వేటు వేసింది.