అన్న సూపర్ హిట్. తమ్ముడు అట్లర్ ఫ్లాప్. అనిల్ అంబానీ ఫెయిల్యూర్ స్టోరీ

ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ప్రత్యేకంగా ఈ ఇద్దరు అన్నదమ్ములను పరిచయం చేయాల్సిన పనిలేదు. దేశంలోనే అత్యంత కాస్ట్లీ సోదరులు వీళ్లు. వీరిలో ఒకరు సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిస్తే… మరొకరు ఫెయిల్యూర్ కు పక్కా ఎగ్జాంపుల్ గా మారారు. అవును ఒకే ఇంట్లో ఇలా రెండు ఢిపరెంట్ లెస్సన్స్ నేర్పే వ్యక్తులు ఉండటం విశేషం. ముఖేష్ తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తిని ఇంతింత పదింతలు చేస్తే…అనిల్ మాత్రం తనకు వచ్చిన సంపదను కనీసం కాపాడుకోకపోగా…ఉన్న మొత్తాన్ని పొగొట్టుకున్నారు. ఎంతలా అంటే ఒకప్పుడు బిలియనీర్ల స్థానంలో 3 వ ప్లేస్ లో ఉంటే…ఇప్పుడు కనీసం ఒక్క బిలియన్ డాలర్ కూడా లేని స్థాయికి చేరాడు.

రిలియన్స్ క్యాపిటల్ దివాళా

ఎప్పుడో ఫేడ్ అవుటైన అయిన అనిల్ అంబానీ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవటం అనుకుంటున్నారా?  అవును దానికి ఓ రీజన్ ఉంది. తన అన్న ఒక్కో మెట్టు ఎదుగుతూ శిఖరం వైపు దూసుకుపోతుంటే తమ్ముడు మాత్రం రోజు రోజు వేగంగా పతనమవుతున్నాడు. ఇప్పటికే తనకున్న అన్ని కంపెనీలు భారీగా లాస్ లో ఉన్నాయి. తాజాగా రిలియన్స్ క్యాపిటల్ దివాళా కు సంబంధించిన చర్యలను రిజర్వ్ బ్యాంక్ చేపట్టింది. అంటే తనకున్న ఓ పెద్ద కంపెనీ ఇక అనిల్ చేజారిపోయినట్లే. ప్రస్తుతం అనిల్ చేతిలో ఉన్న ఏ కంపెనీ కూడా లాభాల్లో లేదు. అన్ని లాస్ మేకింగ్ లో ఉండి ఉన్న కనీసం అప్పులు కట్టలేని స్థితికి చేరాయి.

అన్నకు తమ్ముడికి అస్ మాన్ ఫరక్

అనిల్ అంబానీ అందరిలాంటి పారిశ్రామిక వేత్త అయితే కంపెనీల్లో లాస్, ప్రాఫిట్ కామన్ అనుకోవచ్చు. కానీ తాను అలాంటి, ఇలాంటి బిజినెస్ మేన్ కాదు. ఇండియాలోని రిచ్చెస్ట్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. తన తండ్రి దేశంలోనే అతి పెద్ద వ్యాపార సామ్రాజాన్ని ఏర్పాటు చేశారు. తన అన్న ముఖేష్ అంబానీ ఏషియాలోనే నంబర్ వన్ రిచ్చెస్ట్ పర్సన్. అలాంటి కుటుంబానికి చెందిన అనిల్ అంబానీ ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అన్నతో ఆస్తులు పంచుకునే నాటికి  రిలయన్స్ పవర్, కమ్యూనికేషన్, ఎంటర్ టైన్ మెంట్, రిసోర్సెస్, ఇన్ ఫ్రా, క్యాపిటల్, ఎంటర్ టైన్ మెంట్ వంటి సంస్థలు తనకు వచ్చాయి. అప్పటికే వాటి విలువ 56 వేల కోట్లు. అన్న ముఖేష్ కు ఆర్ఐఎల్, ఐపీసీఎల్ రాగా అనిల్ కు మిగతా కంపెనీలు వచ్చాయి. కానీ ముఖేష్ తన వ్యాపార చతురతతో రిలయన్స్ ను నంబర్ వన్ గా నిలిపారు. అనిల్ మాత్రం రిలయన్స్ కమ్యూనికేషన్ తో సహా ఒక్క కంపెనీని కూడా కాపాడుకోలేకపోయారు. 2008 నాటికి రిచ్చెస్ట్ జాబితాలో మూడో స్థానంలో ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం కనీసం 2 వేల కోట్ల ఆస్తులు కూడా లేని స్థాయికి వచ్చాడు.

ఇద్దరి మధ్య ఏంటీ వత్యాసం

ముఖేష్ పక్కా బిజినెస్ మేన్. తన తండ్రి పాటించే వ్యాపార విలువలను కచ్చితంగా పాటిస్తాడు. ప్రభుత్వాలతో సత్సంబంధాలు మెయింటెన్ చేయటం, మీడియాను మేనేజ్ చేయటం, రిస్క్ ప్రాజెక్ట్ లను పూర్తి చేయటం ధీరుభాయ్ అంబానీ చేసేవారు. అచ్చం ఆ సూత్రాలను ముఖేష్ పాటిస్తారు. తనకు ఎప్పుడు వ్యాపారం, వ్యాపారం, వ్యాపారం అదే ధ్యాస. కానీ అనిల్ అంబానీ రూటు వేరు. తనకు సినిమాలు, పాలిటిక్స్ అంటే ఇష్టం. వ్యాపారంలో ఉంటూనే సినిమా నిర్మాణాలు, పాలిటిక్స్ అంటూ రెండు పడవలపై ప్రయాణం మొదలు పెట్టాడు. దీంతో ఏ రంగంలోనూ సరైన దృష్టి పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. పైగా పెద్ద కార్పొరేట్ సంస్థలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆదుకునేందుకు ఆ గ్రూప్ లో బడా సంస్థ ఏదైనా ఉంటుంది. ముఖేష్ కు అలా ఆర్ఐఎల్ ఉంటే టాటా గ్రూప్ నకు టీసీఎస్ ఉంది. కానీ అనిల్ తన వ్యాపార సామ్రాజ్యంలో అలాంటి స్తంభం లాంటి కంపెనీని తయారు చేసుకోవటంలో విఫలమయ్యాడు. దీంతో తనకు నష్టమొచ్చిన ప్రతిసారీ అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు తన కంపెనీలు సరిగా నడవలేదు. దీంతో ఏం చేయాలో తెలియక అనిల్ ఆగమాగమయ్యాడు.

ఆదుకున్న అన్న

దేశంలోనే రిచ్చెస్ట్ ఫ్యామిలీ కి చెందిన అనిల్ పరిస్థితి ఎంతలా దిగజారిందంటే తను డబ్బులు కట్టకపోతే జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. స్వీడన్ కు చెందిన ఎరిక్ సన్ అనే సంస్థకు దాదాపు 550 కోట్ల రూపాయలు కట్టలేని స్థితిలో ఉంటే ముఖేష్ అంబానీయే ఆ డబ్బు కట్టి తనను ఆదుకున్నాడు. ఇక తన ఆర్ కామ్ బిజినెస్ కూడా పూర్తిగా లాస్ లో ఉండటంతో అందుకు సంబంధించిన ఆఫ్టికల్ ఫైబర్స్ ను కూడా కొని తమ్ముడిని ముఖేష్ ఆదుకున్నాడు. ఆ తర్వాత ఆర్ కామ్ ప్లేస్ జియో ను ముఖేష్ ప్రారంభించాడు. అలా ముఖేష్ సక్సెస్ కు కేరాఫ్ కాగా…ఫెయిల్యూర్ కు అనిల్ అంబానీ ఎగ్జాంపుల్ గా నిలిచాడు.