‘ఒమిక్రాన్’పై కేంద్ర హోంశాఖ అత్యవసర భేటీ

new-variant-Omicron-alert-in air ports

కోవిడ్ నూతన వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన అత్యవసర భేటీ నిర్వహించారు. నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు వీకే పాల్, ప్రధాని మోదీ ప్రధాన శాస్త్రీయ సలహాదారు డాక్టర్ విజయ్ రాఘవన్, ఆరోగ్య, పౌర విమానయానం, ఇతర మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారుల హాజరయ్యారు.

ఒమిక్రాన్ వైరస్ నేపథ్యంలో ప్రపంచ పరిస్థితిపై వారు సమగ్ర సమీక్ష నిర్వహించారు. దేశంలో వివిధ రకాల నివారణ చర్యలు చేపట్టడంతో పాటు మరింత పటిష్టం చేయాల్సిన అంశాలపై చర్చించారు.

అంతర్జాతీయ, ప్రత్యేకంగా ఒమిక్రాన్ నమోదైన దేశాల ప్రయాణికులకు పరీక్షలు, నిఘాపై  ప్రామాణిక నిబంధనల విధానాన్ని సమీక్షించారు. వేరియంట్‌ల గుర్తింపు కోసం జినోమిక్ నిఘాను బలోపేతం చేయాలని నిర్ణయించారు.

విమానాశ్రయాలు/పోర్టులలో టెస్టింగ్ ప్రోటోకాల్‌ను కఠినంగా పర్యవేక్షించేలా ఎయిర్‌పోర్ట్ హెల్త్ అధికారులు, పోర్ట్ హెల్త్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ విమాన సేవలను తిరిగి ప్రారంభించే అంశంపై నిర్ణయాన్ని సమీక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కోవిడ్ మహమ్మారి పరిస్థితిని నిశితంగా పరిశీలించడం జరుగుతుందని వెల్లడించారు.