జూట్‌ మిల్లుల ఏర్పాటుతో 10 వేల మందికి ఉపాధి: మంత్రి కేటీఆర్‌

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి జూట్‌ ఉత్పత్తులు ఉపయోగపడతాయని  మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో మూడు ఆధునిక జూట్‌ మిల్లుల ఏర్పాటుపై మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ సమక్షంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం కామారెడ్డి, వరంగల్‌, సిరిసిల్ల జిల్లాల్లో జూట్‌ మిల్లులను ఏర్పాటు చేయనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జూట్‌ మిల్లుల ఏర్పాటుతో 10, 400 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. జూట్‌ మిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, రాబోయే 20 ఏండ్లలో సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ ద్వారా జూట్‌ ఉత్పత్తులు కోనుగోలు చేస్తామన్నారు.

తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వ్యవసాయ రంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శమని చెప్పారు. సీఎం కేసీఆర్‌ విజన్‌తో వ్యవసాయ దిగుబడులు ఐదింతలు పెరిగాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ విజన్‌తో వ్యవసాయ దిగుబడులు ఐదింతలు పెరిగాయని వెల్లడించారు. రాష్ట్రంలో 10 వేల ఎకరాల్లో స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు.

మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథ పథకాన్ని దేశంలోని చాలా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ విజన్‌కు నిదర్శనమన్నారు.

మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం రాష్ట్రానికి 50 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవుతాయన్నారు. జూట్‌ మిల్లుల ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.