ఇసుకాసురుడు..ఈటల

ఈటెల రాజేందర్ మొన్నటి వరకు భూ బకాసురుడు. మరిప్పుడు ఈటెల అంటే.. ఇసుకాసురుడు. మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హుజురాబాద్ నియోజకర్గంలో ఇసుక దోపిడికి పాల్పడినట్లు తాజాగా బయటపడింది. డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను సాకుగా చూపిన ఈటెల.. ఇసుకదందా చేసినట్లు హుజురాబాద్ ప్రజలు బహిరంగంగానే చెప్తున్నారు.

ఈటెల రాజేందర్ బాగోతాలు రోజు రోజుకు బయటపడుతున్నాయి. మంత్రిగా..ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈటెల చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పేదల భూములను గుంజుకుని భూబకాసురుడిగా పేరుగాంచిన ఈటెల.. పేదలకు ప్రభుత్వం కట్టించే డబుల్ బెడ్ ఇండ్లలోనూ ఈటల చేతివాటం ప్రదర్శించారు. డబుల్ బెడ్ం రూం ఇండ్ల సాకుతో ఇసుక దందాకు పాల్పడి ఇసుకాసురుడి అవతారం ఎత్తారు. నిత్యం 50 లారీల ద్వారా రూ. 25లక్షల విలువైన ఇసుకను అక్రమంగా వరంగల్‌, హైదరాబాద్‌కు తరలించారని హుజూరాబాద్‌ ప్రజలు చెప్తున్నారు. ఆరు నెలలపాటు ఇసుక దోపిడీ నిరంతరాయంగా కొనసాగించి.. దాదాపు రూ.50 కోట్ల వరకు సొమ్ము చేసుకున్నట్టు ఆరోపిస్తున్నారు. ఇందుకోసం తన అనుచరులను రంగంలోకి దింపి, అడ్డువచ్చిన వారిని సైతం బెదిరించి.. తన పనులు చేసుకున్నాడు.

రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ ఇండ్లను మంజూరు చేశారు. అలాగే హుజూరాబాద్‌ నియోజకవర్గానికి కూడా సీఎం కేసీఆర్‌ 4 వేల డబుల్‌ బెడ్రూం ఇండ్లను మంజూరు చేశారు. కానీ.. ఈటల మాత్రం ఒక్క ఇల్లును కూడా పూర్తి చేయలేకపోయారు. పైగా.. ఇదే అదునుగా భావించి ఇసుక తరలింపునకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇండ్లు, ఇసుక క్వారీ కాంట్రాక్టులు తన బినామీలకే కట్టబెట్టారు. తన అనుచరులతో.. జమ్మికుంట మండల పరిధిలోని మానేరు నది నుంచి ప్రొక్లెయినర్లు, లారీల ద్వారా ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగించారు. ఇవన్నీ తెలిసినా..స్థానిక ప్రజలు..మంత్రిగా ఉన్న ఈటెలను ఎదిరించలేకపోయారు.

ఈటల ఇసుక దోపిడీని ఆపే ప్రయత్నం చేసిన వారిపై కేసులు పెట్టి వేధించారనే ఆరోపణలున్నాయి. జమ్మికుంట మండలంలోని తనుగుల వాగులోంచి ఏకంగా ఎక్స్‌కవేటర్‌, లారీలతో ఇసుక తరలించేవారని స్థానికులు చెప్తున్నారు. మండల అధికారుల నుంచి జిల్లా ఉన్నతాధికారుల వరకు తన దందాను అడిగేనాథుడే లేకుండా చేశారని సమాచారం. లారీలను ఆపేందుకు ప్రయత్నించినా.. ఫిర్యాదులపై పోలీసులు స్పందించినా.. క్షణాల్లో ఈటల నుంచి ఫోన్‌ వచ్చేదని గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు సైతం ఇసుక దందాను చూసీచూడనట్టు ఉండేవారని తెలిసింది. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ఇసుక తరలింపును అడ్డుకున్న యువకులను కొట్టిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

డబుల్ బెడ్ రూం ఇండ్లకు సరఫరా చేయాల్సిన ఇసుకను..ఈటెల అక్రమంగా అమ్ముకోవడంతో…హుజురాబాద్ నియోజకవర్గంలో డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇప్పటికి అసంపూర్ణంగా మిగిలాయి. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో నిరుపేదలెందరో ప్రభుత్వం నిర్మించిన డబుల్‌బెడ్రూం ఇండ్లల్లో నివాసం ఉంటుండగా, తమ నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్మాణం పూర్తికాలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.