ఉత్కంఠ పోరు.. 6 పరుగుల తేడాతో ఓడిన సన్‌రైజర్స్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ తో నిన్న జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 6 పరుగుల తేడాతో ఓడింది. 150 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులే చేసింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(54: 37 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్‌), మనీశ్‌ పాండే(38: 39 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు) పోరాటం వృథా అయింది. షాబాజ్‌ అహ్మద్‌(3/7), హర్షల్‌ పటేల్‌(2/25), మహ్మద్‌ సిరాజ్‌(2/25)  సంచలన ప్రదర్శన చేసి హైదరాబాద్‌ను దెబ్బకొట్టారు.

విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. కీలక సమయాల్లో రెచ్చిపోయిన బెంగళూరు బౌలర్లు తమ జట్టుకు అద్భుత విజయాన్నందించారు. గ్లెన్‌ మాక్స్ వెల్‌(59: 41 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు), విరాట్‌ కోహ్లీ(33: 29 బంతుల్లో 4ఫోర్లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో హోల్డర్‌ మూడు వికెట్లు తీశాడు.