ఫేస్ బుక్ పచ్చి లాభాపేక్షతో పనిచేస్తది.. ప్రమాదంలో వినియోగదారుల వ్యక్తిగత సమాచారం.. బాంబు పేల్చిన మాజీ ఉద్యోగిని ఫ్రాన్సిస్ హౌగెన్

నిన్న ఫేస్ బుక్ / వాట్సాప్/ ఇన్ స్టా గ్రామ్ లు ఏడు గంటల పాటు బందై పోయాయి. ఇది కేవలం కేవల టెక్నికల్ లోపం కారణంగా జరుగలేదని కొందరు ఫేస్ బుక్ మాజీ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఫేస్ బుక్ మాజీ ఉద్యోగిని ఓపెన్ ఇంటర్వ్యూ.. ఫేస్ బుక్ తీరుపై అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈ మాజీ ఉద్యోగి తానెవ‌రో లైవ్‌లోకి వ‌చ్చి చెప్పిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఫేస్ బుక్ సేవ‌లు నిలిచిపోవ‌డం గ‌మ‌నార్హం.

ఫేస్ బుక్ లో ప్రొడక్ట్ మేనేజర్ గా పనిచేసి ఫ్రాన్సిస్ హౌగెన్ గత మార్చిలో రిజైన్ చేసి బయటకు వచ్చింది. ఫేస్ బుక్ కు సంబంధించిన పలు రహస్య పత్రాలను, వ్యవహారాలను ఆమె వాల్ స్ట్రీట్ జర్నల్ తోపాటు పలు న్యూస్ ఏజెన్సీలకు అందజేసింది. ఈ మేరకు సీబీఎస్ ఛానల్ లో ఆదివారం ప్రసారమైన ‘60 మినిట్స్’లో పాల్గొని పలు ఆసక్తికర అంశాలను చెప్పింది. ఓపెన్ ఇంటర్వ్యూలో ఫేస్ బుక్ బండారాన్ని బయటపెట్టింది.

గత సంవత్సరం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్‌ని జో బిడెన్ ఓడించిన తర్వాత తప్పుడు సమాచారం, గొడవలను అడ్డుకునేందుకు రూపొందించిన రక్షణ వ్యవస్థలను ఫేస్‌బుక్ అకారణంగా ఎందుకు నిలిపివేసిందని హౌగెన్ ప్రశ్నించింది. ‘ఫేస్‌బుక్ ను దెబ్బతీయడం తన లక్ష్యం కాదు. నాకు ఫేస్‌బుక్ అంటే ఇష్టం. నేను దానిని కాపాడాలనుకుంటున్నాను.’ అని ఈ సందర్భంగా హౌగెన్ అన్నారు.

విద్వేష కంటెంట్‌, జ‌నాల‌ను రెచ్చ‌గొట్టే కంటెంట్ ను ప్ర‌మోట్ చేస్తే.. త‌మ ట్రాఫిక్ పెరుగుతుంద‌ని ఫేస్‌బుక్‌కు తెలుసు. విద్వేష‌, విభ‌జ‌న‌వాదానికి సంబంధించిన కంటెంటే ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిస్తోంద‌ని గుర్తించి వాటినే ఫేస్‌బుక్ అల్గారిథ‌మ్స్ ప్రోత్స‌హిస్తున్నాయి అని హాగెన్ వెల్ల‌డించింది. ఫేస్‌బుక్‌ అంద‌రికీ తెలిసిన దాని కంటే చాలా ఎక్కువ ప్ర‌మాద‌మన్నారు. దీన్ని ఉద్దేశ పూర్వకంగానే ఫేస్ బుక్ అడ్డుకోవడం లేదని హేగన్ చెప్పింది.

ఫేస్ బుక్ ఏవిధంగా కనీస సామాజిక బాధ్యత లేకుండా.. పచ్చి లాభాపేక్షతో, వినియోగదారులకు హానికరమైన విధానాలను అమలు చేస్తుందని తెలియజేసే గుట్టల కొద్ది సాక్ష్యాలను వాల్ స్ట్రీట్ జర్నల్ కు అందించింది. ప్రాణాలకే అపాయం ఉండడంతో మొన్నటి వరకూ తన ఐడెంటిటీని గోప్యంగా పెట్టిన ఆమె.. మొన్న తొలిసారిగా తన ఐడెంటిటీ రివీల్ చేసింది. ప్రస్తుతం ఆమె విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం కింద ఫెడరల్ అధికారుల రక్షణలో ఉన్నది.

ఫేస్ బుక్ వినియోగదారులకు, హానికరమైన విధానాలను పాటిస్తున్న ఫేస్ బుక్ పై కఠినంగా చర్యలు తీసుకోవాలని.. అదేవిధంగా ఫేస్బుక్ విధానాలను కూడా నియంత్రించాలని అమెరికన్ కాంగ్రెస్ కు హౌగెన్ కు అపీల్ చేసింది.

ఫ్రాన్సిస్ హౌగెన్ ఆ ఇంటర్వ్యూ దెబ్బకు ఫేస్బుక్ షేర్ల విలువ భారీగా పతనం అయింది. ఒక్కరోజులో జుకర్ బర్గ్ సంపదలో తొమ్మిది బిలియన్ డాలర్లు ఆవిరి అయ్యాయి. ఇదే సమయంలో ఫేస్ బుక్ సేవల్లో అంతరాయంతో ఇంకా ఈ పతనం కొనసాగుతూనే ఉన్నది.

ఈ రోజు ఉదయం( అమెరికన్ టైం) అమెరికన్ కాంగ్రెషనల్ సబ్ కమిటీ ముందు ఫ్రాన్సిస్ హేగన్స్ వివరమైన ప్రకటన ఇవ్వబోతున్నది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచార గోప్యతపై మరోసారి చర్చ కొనసాగుతుంది.

ఫ్యాక్ట్ సెట్ సర్వే ప్రకారం.. ఫేస్‌బుక్ వార్షిక ఆదాయం 2018లో 56 బిలియన్ డాలర్లు ఉండగా ఈ ఏడాది 119 బిలియన్ డాలర్లకు చేరింది. కంపెనీ మార్కెట్ విలువ 2018 చివరిలో 375 బిలియన్ నుండి 1 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. పూర్తి ఇంటర్వ్యూ బయటకు రాకముందే, ఫేస్‌బుక్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు.. హేగన్స్ వ్యాఖ్యలను ఖండించాడు. ఆమె ఆరోపణలు ‘తప్పుదోవ పట్టించేవి’గా ఉన్నాయన్నారు.