రైతులకు సాగు విజ్ఞానం అందించడానికే రైతు వేదికలు: మంత్రి నిరంజన్ రెడ్డి

రైతులకు సాగు విజ్ఞానం అందించడానికే రైతు వేదికలు నిర్మించినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పెద్దగూడెం గ్రామంలో ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్, నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ , రైతువేదిక,  కిష్టగిరి తండాలో వైకుంఠధామం, బుగ్గపల్లి తండాలో రూ.86 లక్షలతో నిర్మించే 17 డబల్ బెడ్రూం ఇండ్లు, వనపర్తిలో కందకం వద్ద రూ.5 కోట్లతో నిర్మించే నాన్ వెజ్ మార్కెట్ కు శంకుస్థాపన, పడమటి తండాలో రూ.2.46 కోట్లతో నిర్మించిన చెక్ డ్యాం, అంకూరులో రైతువేదికను ఇవాళ మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  దూరదృష్టితో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుబంధును ప్రవేశపెట్టారన్నారు. 24 గంటల ఉచిత కరెంటుతో ధీమాగా రైతాంగం వ్యవసాయం చేస్తుందన్నారు. 63.25 లక్షల మంది రైతులు ఈ వానాకాలం రైతుబంధు పథకం కింద నిధులు అందుకుంటున్నారని, 1.51 కోట్ల ఎకరాల భూమి వీరి ఆధీనంలో ఉందన్నారు. 98 శాతం వ్యవసాయ భూమి సన్న, చిన్నకారు రైతుల చేతులలోనే ఉందని మంత్రి అన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం సామాన్య రైతాంగానికే అందుతున్నదన్నారు. గ్రామీణ సంతల కోసం ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాలలో కూరగాయల వినియోగం పెరిగింది , ఆహార అలవాట్లలో నాణ్యత మీద ధ్యాస పెరిగిందని మంత్రి అన్నారు. కరోనా రాకతో ప్రజలు స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం ఉంటే చాలు అన్న ఆలోచన చేస్తున్నారని మంత్రి అభిప్రాయపడ్డాడు.

మట్టిని నమ్ముకుని సాగు చేస్తున్న రైతు పండించిన ఆహార పదార్ధాలనే ఎంతటి వారైనా తినేదన్నాడు. అటువంటి రైతులోకానికి ఎంత చేసినా తక్కువనేనన్నారు. రైతు బతికితేనే రైతు చుట్టూ ఉన్న వ్యవస్థలు బతుకుతాయన్నారు. దాని మూలంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని మంత్రి చెప్పారు. సామాన్యులు, రైతులు మోసపోకుండా భూ సమస్యలు రాకుండా ధరణిని ప్రారంభించడం జరిగిందన్నారు. రూ.కోటి వెచ్చించి ఖాన్ చెరువుకు లిఫ్ట్ ఏర్పాటు చేసి పెద్దగూడెం గ్రామానికి సాగు నీరు అందించడం జరిగిందని మంత్రి వివరించారు.