ఇంటర్ పరీక్షలు ముగియడంతో స్వగ్రామానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి

జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, బైక్‌ ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో తండ్రి, కూతురు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన గద్వాల మండలం అనంతపురం గ్రామ స్టేజీ సమీపంలో జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఇటిక్యాల మండలం ఎలగొడ్ల మునగాల గ్రామానికి చెందిన నల్లన్న(40), కూతురు రాజేశ్వరి (17) తో కలిసి గద్వాల నుంచి ద్విచక్ర వాహనంపై మునగాలకు వెళ్తుండగా..అనంతపురం స్టేజీ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను గద్వాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాజేశ్వరి గద్వాల మండలం గోనుపాడు కేజీబీవీలో ఇంటర్ సెకండ్‌ ఇయర్ చదువుతున్నది. పరీక్షలు పూర్తి కావడంతో తండ్రి తో కలిసి స్వ గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.