హైదరాబాద్‌‎లో సినిమా షూటింగ్‌లు బంద్

వేతనాలు పెంచాలని డిమాండ్ చూస్తూ సినీ కార్మికులు సమ్మెబాట పట్టారు. దీంతో హైదరాబాద్‌ పరిసరాల్లో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. బుధవారం నుంచి షూటింగ్‎లకు దూరంగా ఉండాలని 24 విభాగాలు నిర్ణయించాయి. వేతనాలు పెంచేవరకు షూటింగ్‎లకు హాజరుకాకూడదని నిర్ణయించారు. ఫిల్మ్ ఛాంబర్ మూడేళ్లకోసారి నిర్మాతలతో చర్చించి వేతనాలు పెంచుతుంది, కానీ ఈ సారి మాత్రం నాలుగేళ్లు అయినా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కార్మికులు మండిపడుతున్నారు. తమ వేతనాలు పెంచాలని సిని కార్మికులు గత కొన్నిరోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా సినీ కార్మికులు ఈ రోజు షూటింగ్‌లకు హాజరుకాలేదు. జూనియర్‌ ఆర్టిస్టులను తీసుకెళ్లే బస్సులను కూడా ఫెడరేషన్‌ సభ్యులు నిలిపివేశారు. దీంతో తెలుగు, తమిళ, హిందీ చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. హైదరాబాద్‌ పరిసరాల్లో 20కిపైగా చిన్న, పెద్ద సినిమాల చిత్రీకరణ ఆగిపోయింది. ఫిలిం ఫెడరేషన్‌ వద్ద 24 విభాగాల కార్మిక సంఘాల నాయకులు ఈ రోజు ఆందోళన నిర్వహించనున్నారు.