రైస్ పుల్లింగ్ పేరుతో ఫ్రాడ్.. పోలీసుల అదుపులో నలుగురు

Rice-Pulling-Fraud

మూఢ నమ్మకాలపై విశ్వాసం కలిగిన అమాయక ప్రజలను నమ్మించి రైస్ పుల్లింగ్ కు పేరుతో మోసాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను తిరుపతి అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి రైస్ పుల్లింగ్ కు వినియోగించిన రెడ్ సల్ఫర్ అనే రసాయన పదార్థంతో తయారు చేసిన ఓ రాగిచెంబుతో పాటు 1లక్ష 54 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా అలిపిరి పోలీసు స్టేషనులో‌ ఏర్పాటు చేసిన డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ.. తిరుపతిలోని సుబ్బారెడ్డి కాలనీ ఫస్ట్ క్రాస్ దగ్గర అనుమానంగా ఉన్న నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి పరార్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా రైస్ పుల్లింగ్ చేసి అమాయక ప్రజలను మోసగిస్తున్నట్లు వెల్లడైందన్నారు.

రెడ్ సల్ఫర్ అనే రసాయణంతో తయారు చేసిన ఓ నల్ల చెంబుకి అతీత శక్తులు ఉన్నాయని, దీనిని అమ్మితే కోట్ల రూపాయలు వస్తాయని గుంటూరుకు చేందిన ఇరువురిని మోసగించి దాదాపుగా 1,60,000 రూపాయల నగదు వసూలు చేసినట్లు తెలిపారు.

అయితే రాగి చెంబుతో మోసం చేస్తున్నారని గ్రహించిన భాధితులు తాము ఇచ్చిన సొమ్మును తిరిగి చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నా నిందుతులు వారికి మాయమాటలు చెప్తూ తిరుగుతున్నారని, వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలిస్తున్నామని అలిపిరి డిఎస్పి మురళీకృష్ణ తెలిపారు.