‘సీఎం కేసీఆర్ ను ఒప్పించి హుజూరాబాద్ కు మెడికల్ కాలేజీ తీసుకొస్తా’

Gell Srinivas Yadav assured that he would persuade CM KCR to bring a medical college to Huzurabad constituency
file photo
Gell Srinivas Yadav assured that he would persuade CM KCR to bring a medical college to Huzurabad constituency
file photo

5 ఏళ్లకు ఓట్లేసి ఈటల రాజేందర్ ను గెలిపిస్తే రెండున్నరేళ్లకు రాజీనామా చేశాడు. రెండు సార్లు మంత్రిగా అవకాశం ఇస్తే ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదు. ఐదేళ్ల క్రితం నాలుగు వేల ఇళ్లు మంజూరు చేసి ఈటెల చేతికిస్తే ఒక్క ఇల్లు నిర్మించ లేదు.. అది పేద ప్రజల పై ఈటల రాజేందర్ కు ఉన్న ప్రేమ అని విమర్శించారు హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్. శుక్రవారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లిలో గెల్లు శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల కష్టాలు పేదలకే తెలుస్తాయనే దృక్పథంతో సీఎం కేసీఆర్ తనకు అవకాశం ఇచ్చారని చెప్పారు. ఒక్క అవకాశం ఇస్తే రెండున్నరేళ్లలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి చేస్తానని అన్నారు. సీఎం కేసీఆర్ ను ఒప్పించి హుజురాబాద్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ తీసుకొస్తానని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వాలు రాష్ట్ర సంపదను దోచుకుంటే.. సీఎం కేసీఆర్ రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచుతున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాన్ని పణంగా పెట్టారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన బిడ్డలకు లక్షా 30 వేల పైచిలుకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. నీళ్ల కోసం రైతులు ధర్నా చేసే పరిస్థితి ఉండేదని, పంటలు ఎండిపోయే దుస్థితి ఉండేదన్నారు. కాళేశ్వరం నీళ్లు వచ్చాయి కాబట్టి చెరువులు, కుంటలు నిండాయి.. పంట పొలాలకు పుష్కలంగా నీరు అందుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా నకిలీ విత్తనాలు అమ్మే పరిస్థితి లేదన్నారు. 2003లో ఎవరికీ తెలియని ఈటల రాజేందర్ ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇవాళ కేసీఆర్ కు ఘోరీ కడతా అంటున్నారని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నందుకు ఘోరీ కట్టాలా? అని ప్రశ్నించారు. ఎవరికి ఘోరీ కట్టాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.

ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంత ఉందో .. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి కూడా అంతే ఉందన్న గెల్లు శ్రీనివాస్.. రైల్వేలో 15 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని, అవి భర్తీ చేస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవని అన్నారు. మన బిడ్డల భవిష్యత్తు దెబ్బతీస్తున్న బీజేపీకి అండగా ఉండాలా అని ప్రశ్నించారు. గ్యాస్ సిలిండర్ ధర రూ. 1050 కి పెంచారని, ప్రజలను వంచించి మోసం చేస్తున్న బిజెపి పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. 30వ తేదిన జరిగే ఎన్నికల్లో మీ బిడ్డగా తనను గెలిపించాలని గెల్లు ప్రజలను అభ్యర్థించారు.