మనవడిని కంటారా? లేక రూ. 5 కోట్లు ఇస్తారా?

ప్రపంచంలోనే ఇటువంటి కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి కావచ్చు. తనకు ఏడాదిలోగా మనవడినో, మనవరాలినో ఇవ్వాలని ఓ మహిళ తన కొడుకు, కోడలిపై కేసు పెట్టింది. హరిద్వార్ కు చెందిన ఓ మహిళ తన కొడుకు, కోడలిపై కోర్టుకెక్కింది. వారిద్దరూ పిల్లల్ని కనకపోవడం వల్ల తాను మానసికవేదన అనుభవిస్తున్నానని తన పిర్యాదులో పేర్కొంది. తనకు ఏడాదిలోగా మనవడు లేదా మనవరాలిని ఇవ్వండి లేదా రూ. 5 కోట్ల పరిహారం చెల్లించండి అని కోర్టును ఆశ్రయించింది.

తన కుమారుడి చదువు కోసం చాలా డబ్బు ఖర్చు చేసి అతడిని విజయవంతమైన పైలట్‌గా చేశానని ఆ మహిళ తన పిటిషన్‌లో పేర్కొంది. తన కొడుకుకు 2016లో భారీ మొత్తం ఖర్చు చేసి పెళ్లి చేశానని.. ఆ తర్వాత తన సొంత డబ్బుతో కొత్త జంటను హనీమూన్‌ కోసం థాయ్‌లాండ్‌కు కూడా పంపానని ఆమె తెలిపింది. అయితే పెళ్లి తర్వాత, కోడలు తన కొడుకు చేత హైదరాబాద్‌కు మకాం మార్పించిదని.. అప్పటి నుండి వారిద్దరూ తనతో మాట్లాడటం లేదని ఆ తల్లి తెలిపింది. అంతేకాకుండా.. తన కోడలి కుటుంబం తన కొడుకు జీతాన్ని పూర్తిగా తీసుకుంటుందని, పైగా వారి కుమార్తెకు ఈ విషయంలో మద్దతు ఇస్తున్నారని దావాలో ఆరోపించింది. కొడుకు, కోడలు ఏడాదిలోపు బిడ్డను కనేలా ఆదేశించాలని, లేకుంటే తనకు రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆ తల్లి దావాలో కోరింది.