‘వ‌ర్క్ ఫ్రం ఆఫీస్’కు గూగుల్ కొత్త కండిషన్లు

google

క‌రోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీ గూగుల్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. అమెరికాలో వర్క్ ఫ్రం ఆఫీసుకు వ‌చ్చేవారు వారానికి ఒక‌సారి కోవిడ్‌-19 ప‌రీక్ష‌లు చేయించుకోవాలని కండిషన్ పెట్టింది.

కోవిడ్‌-19 నెగెటివ్ స‌ర్టిఫికెట్ చూపిన వారిని గూగుల్ వ‌ర్క్ సైట్స్ ఆఫీసుల్లోకి అనుమ‌తి ఇస్తామ‌ని గూగుల్ స్ప‌ష్టం చేసింది. అలాగే ఆఫీసుల్లోనూ స‌ర్జిక‌ల్ మాస్క్ లను విధిగా పెట్టుకోవాలని సర్క్యులర్ జారీ చేసింది.

క‌రోనా నియంత్రణకు అమెరికాలోని గూగుల్ ఆఫీసుల‌కు వ‌చ్చే వారి కోసం తాత్కాలిక హెల్త్‌, సేఫ్టీ చ‌ర్య‌లు చేప‌ట్టాలని నిర్ణ‌యించిన‌ట్లు గూగుల్ తెలిపింది. ఉద్యోగులు, డిపెండెంట్లు, ఇంట్లో ఉండే ఇత‌రుల‌కు ఇంటి దగ్గరే ఉచితంగా ఇన్‌ప‌ర్స‌న్ టెస్టింగ్ ఆప్ష‌న్లు అందిస్తున్నామ‌ని ప్రకటించింది.

ఈ నెల నుంచే వ‌ర్క్ ఫ్రం ఆఫీసుల‌కు తమ ఉద్యోగులను ఆహ్వానించాల‌ని గూగుల్ నిర్ణ‌యించింది. కానీ ఇటీవల ఒమిక్రాన్ కేసులు పెరగడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. 2020లో కరోనా తొలినాళ్లలో వ‌ర్క్ ఫ్రం హోం సేవ‌ల‌కు అనుమ‌తించిన తొలి సంస్థ‌గా గూగుల్ నిలిచిన విషయం తెలిసిందే.