నకిలీ విత్తనాలపై సర్కారు ఉక్కుపాదం.. మంత్రి నిరంజన్ రెడ్డి - TNews Telugu

నకిలీ విత్తనాలపై సర్కారు ఉక్కుపాదం.. మంత్రి నిరంజన్ రెడ్డినకిలీ విత్తనాలపై సర్కారు ఉక్కుపాదం మోపుతుందని, వాటిని అమ్ముతూ దొరికిన వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

నకిలీ విత్తనాలను అరికట్టేందుకు హాకా భవన్ లో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇందులో ఐజీ నాగిరెడ్డి, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు బాలు, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

1966 లో రూపొందించిన కేంద్ర ప్రభుత్వ  విత్తన విధానాలు లోప భూయిష్టంగా ఉన్నాయని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. విత్తన చట్టాల బలోపేతానికి కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. వ్యవసాయరంగానికి ముఖ్యమంత్రి  కేసీఆర్ గారి ప్రాధాన్యం .. నకిలీ విత్తనాలను ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు.

దేశంలో నకిలీ విత్తన తయారీ దారులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. ప్రధానంగా పత్తి, మిరప నకిలీ విత్తనాలపై ప్రధాన దృష్టి సారించినట్టు మంత్రి చెప్పారు.

ఇప్పటికే ఈ సీజన్ లో 177 కేసులు నమోదు చేసి 276 మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. 3468 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను సీజ్ చేయడం జరిగిందని మంత్రి వివరించారు.

విత్తనాల లైసెన్సింగ్ విధానం పారదర్శకంగా అమలు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. విత్తన లైసెన్సుల జారీకి కాలపరిమితిని నిర్దేశించి నిర్ణీత సమయంలో ఇవ్వాలని సూచించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు రేపు క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు చెప్పారు.