పెండ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు హాస్పిటల్ పాలు.. పెండ్లి మాత్రం ఆగలేదు.. వధువు ఏం చేసిందంటే

పెండ్లంటే ఎవరికైనా జీవితాంతం గుర్తుండిపోయ మధురమైన రోజు. కానీ.. సరిగ్గా ముహుర్తం సమయానికి వరుడు దవాఖానా పాలయ్యాడు. కానీ.. పెండ్లి మాత్రం ఆగలేదు. అంతా అనుకున్నది అనుకున్నట్టే జరిగింది. పెళ్లంటే ప్రత్యేకమైన రోజుగా గుర్తుంచుకునేలా చేశాడు వరుడు.


అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన ఇద్దరు ప్రేమికులు కొన్నేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెండ్లి చేసుకొని ఇద్దరూ ఒకటవుదామనుకున్నారు. బంధువులకు సమాచారం ఇచ్చారు. వేదిక, పెండ్లి ఏర్పాట్లు అన్నీ రెడీ చేసుకున్నారు. తీరా పెండ్లి ముహుర్తం వచ్చేసరికి వరుడు అనారోగ్యం పాలయ్యాడు. అయితే పెండ్లి ఆగడం వరుడికి ఇష్టం లేదు. అంతా అనుకున్నట్టే జరగాలని ఫిక్స్ అయ్యాడు. అందుకోసం ఓ ప్లాన్ వేశాడు. వధువు అదే ప్లాన్ పాటించి పెండ్లి తంతు ముగించింది. అసలేం చేశారంటే..


వధువు పెండ్లి దుస్తులు వేసుకొని రెడీ అయిపోయింది. మరోవైపు వరుడు హాస్పిటల్లోనే ఉన్నాడు. అతడి పెండ్లి డ్రెస్ ఓ కర్రకు తొడిగారు. మొఖం స్థానంలో ట్యాబ్ అమర్చి స్క్రీన్ సేవర్ గా వరుడి ఫొటోను పెట్టారు. ఆ బొమ్మతో కలిసి వధువు మ్యారేజ్ కేక్ కట్ చేసింది. ఈ తతంగానికి సంబంధించిన వీడియో అయితే వైరల్ అయింది గానీ.. ఆ వధూవరుల పేర్లు మాత్రం తెలియలేదు. పెళ్లి చేసుకొని ఒకటవుదామనుకున్న ఆ ప్రేమికుల కలలకి కరోనా రెండుసార్లు దెబ్బకొట్టింది. మూడోసారి కూడా వరుడు అనారోగ్యానికి గురయ్యాడు. పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది.

ఇఫ్పటికే రెండు సార్లు పెండ్లి ఆగిపోవడంతో ఈ సారి ఎలాగైనా పెండ్లి జరిగి తీరాల్సిందే అని ఫిక్సయ్యాడు. తాను చెప్పినట్టు ఏర్పాట్లు చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఈ వెరైటీ కాన్సెప్ట్ మీద నెటిజనులు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొంతమంది కొత్తజంటను ఆశీర్వదిస్తూ కామెంట్లు పెడితే.. మరికొందరు మాత్రం ఆమె అబ్బాయిని పెండ్లి చేసుకుందా.. ట్యాబ్ ని పెండ్లి చేసుకుందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. పెండ్లి ఖర్చు మిగిలింది అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా వరుడు లేకపోయినా జరిగిన ఈ పెండ్లి వీడియోని అందరూ ఆసక్తిగా చూశారు.