ఇంటివద్దే ఆక్సిజన్ చెకప్ : మంత్రి ఈటల

Health Minister Comments On Corona Health Checkups And Oryzin Supply
Health Minister Comments On Corona Health Checkups And Oryzin Supply

కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినవారిలో ఎక్కువమంది చికిత్సపై అవగాహన లేకపోవడంతో శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. అలాంటివారు చివరి నిమిషంలో దవాఖానకు వస్తున్నారని.. పరిస్థితి అంతవరకు రాకుండా జాగ్రత్తలు తీసుకొని ప్రమాదం నుంచి బయటపడవచ్చని ఆయన తెలిపారు. హోం ఐసొలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న న్న ప్రతిఒక్కరికీ ఆశా వర్కర్లు రోజుకు రెండుసార్లు ఆక్సిజన్‌ లెవల్స్‌, జ్వర పరీక్షలు చేయాలని సూచించారు. హోం ఐసొలేషన్‌ అవకాశం లేనివారి కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐసొలేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లా వైద్యాధికారులు, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆదివారం మంత్రి ఈటల టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Health Minister Comments On Corona Health Checkups And Oryzin Supply
Health Minister Comments On Corona Health Checkups And Oryzin Supply

కరోనా సెకండ్‌ వేవ్‌లో ఒక్కరికి వస్తే వారి కుటుంబసభ్యులందరికీ వ్యాప్తి చెందుతున్నదని తెలిపారు. ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రభుత్వ ఐసొలేషన్‌ కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. లక్షణాలు ఉన్నవారు ఏ ప్రాంతం నుంచి వచ్చినా పరీక్షలు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రైవేటు దవాఖానాలో పరీక్షలు చేయించుకొని పాజిటివ్‌ వచ్చిన వారందరి వివరాలను సైతం వైద్యారోగ్యశాఖకు తెలియజేయాలని.. వారందరికీ హోం ఐసొలేషన్‌ కిట్స్‌ అందజేయాలని ఆదేశించారు. టెలిమెడిసిన్‌ ద్వారా అనుమానాలు నివృత్తి చేయాలని ఆదేశించారు. ఐఎంఏ వారు సైతం ఈ విషయంలో సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చారని తెలిపారు.

ప్రైవేటు చికిత్సపై పర్యవేక్షణ

ప్రైవేటు దవాఖానల్లో చికిత్సను నిరంతరం పరవేక్షిస్తూ.. ఆక్సిజన్‌ అవసరమైతే అందించాలని మంత్రి ఈటల అధికారులకు సూచించారు. వారం రోజులుగా కేసుల పెరుగుదల తీవ్రత తగ్గిందని, వ్యాప్తి కూడా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. వైద్యారోగ్యశాఖకు ఏం అవసరం ఉన్నా వెంటనే సమకూర్చుకోవాలని.. వైద్యులు, సిబ్బంది అవసరం ఉంటే నియమించుకోవాలని ఆదేశించారు. వైద్యాధికారులకు వెహికల్‌ అలవెన్స్‌ అందేలా చూడాలని ఉన్నతాధికారులకు సూచించారు. కరోనా లక్షణాలు ఉంటే నిర్ధారణ పరీక్షలతో సంబంధం లేకుండా చికిత్స మొదలుపెట్టాలన్నారు. అర్బన్‌ పీహెచ్‌సీ, బస్తీ దవాఖానలు, జీహెచ్‌ఎంసీ ఏరియాలో ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు ఎక్కువమందిని నియమించుకోవాలని ఆదేశించారు. అనంతరం జిల్లా అధికారులతో స్థానికంగా పరిస్థితులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఎం రిజ్వీ సూచించారు. టెస్టింగ్‌, ట్రాకింగ్‌, ట్రీటింగ్‌ విధానంతో ముందుకెళుతున్నామన్నారు.