ఏపీలోని ఆ జిల్లాలకు భారీవర్షాల హెచ్చరిక.. రేపు స్కూళ్లకు సెలవు

Moderate rains

ఏపీలోని పలు జిల్లాలో అల్పపీడన ప్రభావంతో భారీవర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ జిల్లాల పరిధిలో రేపు (సోమవారం) విద్యాశాఖ సెలవు ప్రకటించింది. రాబోయే రెండు రోజుల్లో ఈ జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

గత కొన్ని రోజులుగా ఏపీలోని పలు జిల్లాలో వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. రాయలసీమ జిల్లాతో పాటు నెల్లూరులో కూడా గత 24 గంటల నుంచి వర్షాలు పడుతున్నాయి. రేపు అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడనున్నదని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, డిసెంబర్ 1 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.