వర్షాల బీభత్సం.. కేరళలో విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. 11కు చేరిన మృతుల సంఖ్య

కేర‌ళ‌లో వర్షాలు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. కొట్టాయం జిల్లా కూట్టిక‌ల్ ప్రాంతంలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డటంతో తీవ్ర ప్రాణ నష్టం సంభవించింది. రెస్క్యూ టీమ్స్ స‌హాయ‌క చ‌ర్య‌లు కొనసాగుతున్నాయి. ఇప్ప‌టికే తొమ్మ‌ది మృత‌దేహాల‌ను వెలికితీసిన ర‌క్ష‌ణ సిబ్బంది.. తాజాగా మ‌రో రెండు మృత‌దేహాలను వెలికితీశాయి. దాంతో మొత్తం మృతుల సంఖ్య 11కు చేరింది.

గ‌త కొద్ది రోజులుగా ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న వ‌ర్షాలవ‌ల్ల రాష్ట్రంలోని న‌దుల‌న్నీ ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయి. ప‌లు న‌గ‌రాల్లో ర‌హ‌దారులు న‌దుల‌ను త‌ల‌పిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఎన్డీఆర్ఎఫ్ బ‌ల‌గాలు, ఆర్మీ సిబ్బంది, భార‌త వాయుసేన ముంపు ప్రభావిత ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నాయి. నిరాశ్రయులను పునరావాస కేంద్రాలకు తరలించి ఆశ్రయం కల్పిస్తున్నారు.