‘ఎనర్జీ స్టోరేజ్ హబ్’కు అధిక ప్రాధాన్యత: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

Minister Puwada Ajay Kumar

ప్రజా రవాణా వ్యవస్థలోనూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహం అందిస్తూ ఛార్జింగ్ అవసరాల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.  కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంపై రాష్ట్రంలో లలిత్ గోల్ఫ్ అండ్ స్పారిస్టార్, కెనకోనాలో జరిగిన అత్యున్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో మన రాష్ట్రం నుంచి ఆయన పాల్గొన్నారు.

వివిధ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, పరిశ్రమ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, సాంకేతిక నిపుణులతో జరిగిన ఈ సమావేశంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం, పెట్టుబడులను ఆకర్షించే మార్గాలపై చర్చించారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమావేశంలో మంత్రి వివరించారు.

ఢిల్లీ , గుజరాత్ తరువాత ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజీ పాలసీని ప్రారంభించిన మూడవ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి అనేక రాయితీలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వినియోగానికి ప్రోత్సహాకాలు అందిస్తోందని తెలిపారు.

Minister Puwada Ajay Kumar

ఈ మేరకు రాష్ట్రంలో కొనుగోలు చేసి నమోదు చేసుకున్న మొదటి రెండు లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులో వంద శాతం మినహాయింపు అందిస్తున్నట్లు వివరించారు. అలాగే 20 వేల ఆటోలు, 10 వేల లైట్ గూడ్స్ వెహికల్స్, 5 వేల ఎలక్ట్రిక్ కార్లు, మొదటి 500 ఎలక్ట్రిక్ బస్సులకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు.

తాజా విధానాలకు అనుగుణంగా ఇ.వి , ఇ.ఎన్.ఎన్ ( ఎలక్ట్రిక్ వేహికల్, శక్తి నిల్వ ) వ్యవస్థ రంగాలకు తెలంగాణను ప్రధాన స్థావరంగా మార్చడం, యు.ఎస్.డి 4.0 బిలియన్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడం, షేర్ మొబిలిటీ, ఛార్జీంగ్, మానవ వనరుల అభివృద్ధి, ఇ.వి, ఇ.ఎస్.ఎస్ తయారీ కార్యకలాపాలలో ఇ.విల ద్వారా 2030 నాటికి లక్షా 20 వేల మందికి ఉపాధి కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

కర్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ఎకో ఫ్రెండ్లీ వాహనాలను కొనుగోలు చేసేందుకు పలువురు మొగ్గు చూపుతున్నారని, దీంతో హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగిపోతున్నాయని చెప్పారు. నగరంలో 2016 లో కేవలం 25 ఎలక్ట్రిక్ వాహనాలు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 10 వేలకు పైగా పెరిగాయని వెల్లడించారు.

ప్రతి పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్కు భద్రతా ఉపకరణాలు, తగిన పౌర సేవలు, కేబులింగ్, ఎలక్ట్రిక్ వర్కులతో సహా అన్ని సంబంధిత సబ్ స్టేషన్ పరికరాలతో కూడిన ప్రత్యేకమైన ట్రాన్స్ఫార్మర్ అవసరం అవుతుందని, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఛార్జర్లను కలిగి ఉండాల్సి ఉందన్నారు. .

ఈ మేరకు తెలంగాణ రాష్ట్రం అత్యంత సమగ్రమైన విధానాన్ని తీసుకొచ్చిందని, పటిష్టమైన ఆలోచనలతో ఈ పాలసీని రూపొందించే సమయంలో ఆచరణాత్మక విధానాన్ని అనుసరించామని తెలిపారు. సమావేశంలో రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు కూడా పాల్గొన్నారు.