- రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
- నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు
ఆమె ఓ గృహిణి. భర్తకు తెలియకుండా మరో వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకుంది. ఆ వ్యక్తి తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో.. ఫేస్బుక్ ఫ్రెండ్‌తో కలిసి ప్లాన్ చేసి హత్య చేసింది. వివరాలలోకి వెళ్తే.. మీర్పేట్ ప్రశాంతిహిల్స్‌కు చెందిన శ్వేతా రెడ్డి ( 32 ) గృహిణి. బాగ్ అంబర్‌పేట్‌కు చెందిన యశ్మకుమార్ ( 32 ) వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్. వీరిద్దరికీ 2018లో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత స్నేహం, ఆ స్నేహం కాస్తా చనువు పెరిగి అక్రమసంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఇద్దరూ నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుకునే వారు. కాగా.. గత నెల రోజుల నుంచి తనను పెళ్లి చేసుకోవాలని శ్వేతారెడ్డిని యశ్మ కుమార్ బలవంతం చేయసాగాడు. పైగా.. పెళ్లి చేసుకోకపోతే నగ్న వీడియోలు, ఫొటోలు బయటపెడతానని బెదిరిస్తున్నాడు. దాంతో శ్వేతారెడ్డి భయపడి.. యశ్మకుమార్ ని చంపేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా తనకు ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా తిరువూరు మండలానికి చెందిన కొంగల అశోక్ ( 28 )ని ఆశ్రయించింది. శ్వేతారెడ్డి కోరిక మేరకు అశోక్ ఈ నెల 4న హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అదే రోజు రాత్రి శ్వేతారెడ్డి.. యశ్మకుమార్కి ఫొన్ చేసి ఏకాంతంగా కలవాలని చెప్పి ప్రశాంతిహిల్స్‌కు రప్పించింది. యశ్మకుమార్‌తో వెయిట్ చేస్తున్న స్థలాన్ని ఫొన్ చేసి అశోక్‌కు చెప్పింది. అప్పటికే శ్వేతారెడ్డి ఫొన్ కోసం ఎదురుచూస్తున్న అశోక్.. కార్తీక్ అనే మరో వ్యక్తితో కలిసి ప్రశాంతిహిల్స్‌కు చేరుకున్నాడు. సుత్తితో యశ్మకుమార్ తలపై రెండు మూడుసార్లు బలంగా కొట్టి పరారయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న యశ్మకుమార్‌ని ఆస్పత్రిలో చేర్పించగా.. 6వ తేదీ మధ్యాహ్నం మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. సీఐ మహేందర్ రెడ్డి సీసీ ఫుటేజీల సాయంతో కేసును ఛేదించి.. శ్వేతారెడ్డితో పాటు హత్యకు పాల్పడిన అశోక్, కార్తీక్‌లను అదుపులోకి తీసుకున్నారు.