బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంత పెన్షన్ ఇస్తున్నారా?: మంత్రి హరీష్ రావు

ఈటెల రాజేందర్.. కేసీఆర్ కు మానవత్వం లేందంటున్నాడు.. పెన్షన్ తీసుకుంటున్న అవ్వను అడిగితే తెలుస్తుంది కేసీఆర్ కు మానవత్వం ఉందొ లేదో.. కళ్యాణలక్ష్మీ చెక్కు అందుకున్న చెల్లెను అడిగితే తెలుస్తది అని మంత్రి హరీష్ రావు అన్నారు. కరీంనగర్ ఇల్లందకుంట మండలం కనగర్తిలో సాయిచంద్ బృందంచే ధూంధాం కార్యక్రమం జరిగింది. మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ‘‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంత పెన్షన్ ఇస్తున్నారా? 57 ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతున్నాం. 7 ఏళ్ల క్రితం ఎండా కాలం వస్తే నీటికి అరిగోసపడ్డాం. బీజేపీ ప్రభుత్వం బాయిల కాడ మీటర్లు పెడుతోంది. అసెంబ్లీ సాక్షిగా మోటార్లకు మీటర్లు పెట్టం అని సీఎం కేసీఆర్ చెప్పారు. మీటర్లు కావాలంటే ఈటెలకు.. మీటర్లు వద్దంటే గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ఓటేయాలి.

కాళేశ్వరం నీళ్లను వంద తాటి చెట్లంత ఎత్తుకు ఎత్తి గ్రామాలకు నీళ్లు తెచ్చినమా లేదా.. నీళ్లు వద్దనే అంత గొప్పగా టీఆరెస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చిందా లేదా. రెండు పంటలకు నీళ్లు ఇచ్చింది నిజం కాదా? రూ.50 వేల వరకు రైతు రుణ మాఫీ చేశాం.. వచ్చే బడ్జెట్లో రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తాం.

సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టిస్తాం

కరోనాతో ఆదాయం తగ్గినా పెన్షన్లు.. రైతు బంధు ఆపలేదు. సీఎం కేసీఆర్ పేద ప్రజలకు కష్టం రాకుండా చూశారు. ఈటల ఒక్క పని అయినా చేస్తా అంటున్నారా.. బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను రూ. 1000 కి పెంచింది. ఈటెల రాజేందర్ కు బీజేపీలో పలుకుబడి ఉంటే రూ. 1000 సిలిండర్ రూ. 500 కు తగ్గించాలి. ఈటెల ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టిస్తాం. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపిస్తే కనగర్తిలో 100 డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తాం.

రైతులంటే గౌరవం లేదు

హుజురాబాద్ ప్రజలు బాగుపడలా.. ఈటెల రాజేందర్ బాగుపడలా ఆలోచించాలి. బీజేపీ పార్టీ అన్ని రకాలుగా మోసం చేసింది. రైతులంటే గౌరవం లేని పార్టీ బీజేపీ. 30వ తేదీన ఓటేయడానికి వెళ్ళేటప్పుడు గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టుకుని వెళ్ళండి. రూపాయి బొట్టుబిళ్ళతో బతుకుతామా.. రూ. లక్ష116 కల్యాణ లక్ష్మీతో బతుకుతమా..? గడియారాలతో బతుకుతామా.. రూ. 2 వేల పెన్షన్ తో బతుకుతమా? మీ కళ్ల ముందు చేసిన పనులు ఉన్నాయి. ఆరు సార్లు ఈటెలను గెలిపించారు.. ఒక్కసారి గరీబోళ్ల బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు అవకాశం ఇవ్వండి.

ఈటలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి

సిద్దిపేటలో ఎలా చేశామో.. ఇక్కడ కూడా పని చేయించే బాధ్యత మాది. కుల వృత్తుల వారికి అన్ని రకాల సాయం చేశాం. ఆరు సార్లు గెలిపించి.. మంత్రిని చేస్తే తండ్రి లాంటి సీఎం కేసీఆర్ కు ఘోరీ కడతా అంటున్నాడు.. మీరే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. నిజాయితీ ఉంటే నల్ల చట్టాలు రద్దు చేయాలి.. ధరలు తగ్గించాలి. కల్యాణ లక్ష్మీ ఎస్సీలతో మొదలు పెట్టి అన్ని కులాల్లోని పేదలకు ఇచ్చారు. అన్ని వర్గాల పేదలకు దళితబంధు లాంటి సాయం చేస్తారు.

ప్రజలను మోసం చేయడం అవసరమా..

చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు సీఎం కేసీఆర్. అధికారంలో ఉన్నాం కాబట్టి బాధ్యతతో మాట్లాడుతుంటే.. బీజేపీ వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. ఏదో రకంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేయడం అవసరమా. ఈటెల రాజేందర్ మద్యం ఏరులై పారిస్తున్నారు.’’ అని ఈటలపై మండిపడ్డారు.

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. నాలుగు నెలలుగా ఇల్లందకుంట మండలంలోని సమస్యలన్నీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాను. కొత్త ఎమ్మెల్యేతో పాటు మీ సమస్యల పరిష్కారానికి నేనూ కృషి చేస్తానన్నారు.

అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఈటెల రాజేందర్ కు ఐదేళ్ల కోసం గెలిపిస్తే.. పేద ప్రజలు ఎక్కడికైనా వెళ్ళండి అని రాజీనామా చేశాడు. ఐదేళ్ల క్రితం సీఎం కేసీఆర్ ఈటెలకు 4 వేల ఇండ్లు మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. మంత్రి హరీష్ రావు 5 వేల ఇండ్లు కట్టి పట్టుబట్టలు పెట్టి మరీ లబ్ధిదారులకు అందించారు. ఒక్క ఇల్లు కట్టలేదంటే పేదల పట్ల ఈటెల చిత్తశుద్ధిని అర్ధం చేసుకోవాలి. నన్ను గెలిపిస్తే 5 వేల ఇండ్లు కట్టిస్తా. రాబోయే రోజుల్లో హుజురాబాద్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ తెప్పించేలా కృషి చేస్తా. నియోజకవర్గానికి ఎన్ని కోట్ల నిధులైనా తెచ్చి అభివృద్ధి చేస్తా. ఈ ప్రాంత సమస్యలన్ని మీ బిడ్డగా పరిష్కరిస్తానన్నారు.