రంది లేని కంది.. కాసులు కురిపిస్తున్న పంట - TNews Telugu

రంది లేని కంది.. కాసులు కురిపిస్తున్న పంటకంది అనగానే వర్షాధార పంటగా.. పత్తి, మక్క సాళ్లలో వేసే అంతర్‌పంటగా వేసేందుకు రైతులు మొగ్గుచూపుతారు.  ఇంటి అవసరాలకు సరిపోను వరి పొలం గట్లపై విత్తుకునే పంటగానే చాలామంది రైతులు అనుకుంటారు. కానీ, పరిస్థితులు మారాయి. కందిని ఇక పూర్తి స్థాయి పంటగా సాగుచేయాల్సిన సమయం వచ్చింది. మార్కెట్‌లో కందులకు డిమాండ్‌ భారీగా పెరుగుతున్నది. కందులను పండించే రైతుకు కాసులు కురిపిస్తున్నది.

20 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం

ప్రభుత్వం కూడా  కంది సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది. దీంతో క్రమంగా కంది విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. 2019-20 వానకాలంలో 7.38 లక్షల ఎకరాల్లో కంది వేయగా.. గతేడాది 10.84 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇక ఈ ఏడాది కంది సాగు అంచనాను ప్రభుత్వం రెట్టింపు చేసింది. ఏకంగా 20 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

మూడు జిల్లాల్లోనే అధికం

వికారాబాద్‌, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో రైతులు కందిని పూర్తిస్థాయి పంటగా సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో గతేడాది సాగయిన 10.84 లక్షల ఎకరాల్లో వికారాబాద్‌, సంగారెడ్డి, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాల్లోనే 5 లక్షల ఎకరాలు ఉన్నది. వికారాబాద్‌ జిల్లాలోనే 1.85 లక్షల ఎకరాల్లో వేశారు. నారాయణపేటలో 1.37 లక్షలు, సంగారెడ్డిలో 1.08 లక్షల ఎకరాల్లో సాగు చేశారు.

పూర్తిస్థాయి పంటగా..

కందిని అంతర పంటగా వేస్తే ఎకరాకు రెండు క్వింటాళ్లకు మించి దిగుబడిరాదు. పూర్తిస్థాయి పంటగా సాగుచేయడం వల్ల సగటున 4-6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. దీంతో రూ.30 వేల- 36 వేల వరకు ఆదాయం వస్తుంది. డిమాండ్‌లేని మక్కలను రూ.వెయ్యి నుంచి రూ.1,200లకు మాత్రమే అమ్ముకోవాల్సి వస్తున్నది. కాబట్టి మక్కల కంటే కందిని వేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నీటి తడులతో రెట్టింపు దిగుబడి

రాష్ట్రంలో సాగునీటి వనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్న నేపథ్యంలో కందిని వర్షాధారంగా కాకుండా నీటి తడులతో సాగుచేస్తే రెట్టింపు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. రెండుతడుల నీళ్లు పారిస్తే చెల్కల్లో 6-8 క్వింటాళ్లు, రేగడుల్లో 10-12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

మద్దతు ధరకు మించి ధర

కందులకు మార్కెట్లో మద్దతు ధరకు మించి ధర లభిస్తున్నది. గత వానకాలంలో మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించి ఏకంగా 3 లక్షల టన్నుల కందులను కొనుగోలు చేశారు. కందులకు మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6 వేలు కాగా.. గతేడాది వికారాబాద్‌ మార్కెట్లో గరిష్ఠంగా రూ.7,200 పలికింది. ఈ ఏడాది కందులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను రూ.300 పెంచి.. రూ.6,300 చేసింది.