20 ఏండ్ల వ‌య‌సులో అనుకుంటే.. 70 ఏండ్ల వ‌య‌సులో నెరవేరింది

Hukundas-Vaishnav

రాజ‌స్థాన్‌లోని జ‌లోర్‌కు చెందిన హుకుందాస్ వైష్ణ‌వ్‌(77).. ప‌ది పాస్ అవుతాన‌ని 20 ఏండ్ల వ‌య‌సులో అనుకుంటే.. 70 ఏండ్ల వ‌య‌సులో పాస్ అయ్యాడు. చ‌దువుకోవాల‌నే క‌సి ఉంటే ఏ క‌ష్టం అడ్డురాదని చెప్పే ఈ వృద్ధుడి స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

హుకుందాస్ వైష్ణ‌వ్‌.. ప‌ది పాస్ అయ్యేందుకు ఏకంగా 56 సార్లు ఎగ్జామ్స్ రాశాడు. 1945లో జ‌న్మించిన ఈ తాత.. ఒక‌టి నుంచి 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు టీకీ విలేజ్‌లో చ‌దివారు. 1962లో తొలిసారిగా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాశారు.

ఎన్నిసార్లు అటెండ్ అయిన పాస్ అవ్వట్లేదని త‌న‌ను అవ‌మానించి, హేళ‌న చేసిన స్నేహితుల ముందే వైష్ణ‌వ్ ప్ర‌తిజ్ఞ చేశాడు. ఏదో ఒక‌రోజు తాను త‌ప్ప‌కుండా ప‌ది పాస్ అవుతాన‌ని వైష్ణ‌వ్ ప్ర‌తిన‌బూనాడు. ఫెయిలైన ప్ర‌తిసారి కుంగిపోలేదు. ఎట్టకేలకు 56వ సారి వైష్ణ‌వ్ ప‌దిలో ఉత్తీర్ణ‌త సాధించి.. ఆద‌ర్శంగా నిలిచాడు.

2005లో ట్రెజ‌రీ డిపార్ట్‌మెంట్‌లో నాలుగో త‌ర‌గ‌తి ఉద్యోగిగా ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. ఇదే ఊపుతో 2021-22 విద్యాసంవ‌త్స‌రంలో జరిగే 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసేందుకు సిద్ధ‌మ‌వుతున్నట్లు వైష్ణ‌వ్ చెప్పడం కొసమెరుపు.