మిర్యాలగూడలో దారుణం.. కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త

నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి.. తన భార్యను గొంతునులిమి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ టౌన్‌లోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్న గూడపూరి దీపక్, స్రవంతికి ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు కూడా ఉన్నాడు. దీపక్‌ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, కొన్నేళ్లుగా ఈ దంపతుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో స్రవంతి తన కుమారుడితో కలిసి మిర్యాలగూడలో, దీపక్ తన తల్లితో కలిసి నకిరేకల్‌లో విడిగా జీవనం కొనసాగిస్తున్నారు. అయితే, భార్యను తిరిగి కాపురానికి రావాలని దీపక్ పలుమార్లు కోరాడు. కానీ భార్య తన మాట వినకపోవడంతో దీపక్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెను చంపేయాలని ఫిక్స్ అయ్యాడు.

ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి మిర్యాలగూడకు వెళ్లిన దీపక్.. స్రవంతి ఇంటికి వెళ్లాడు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న దీపక్.. తన భార్య గొంతు నులిమి చంపేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలికి చేరుకుని స్రవంతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.