ఒక మోరీ కూడా కట్టివ్వలేని ఈటల.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు.. హుజురాబాద్ కు శనిలా పట్టాడు

కరీంనగర్ జమ్మికుంటలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పాడి కౌశిక్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. రెండు సార్లు మంత్రిగా ఈటెల ఎంతో అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్నా చేయలేకపోవడం విచారంగా ఉందన్నారు. నిధులకు కొరత లేకున్నా ఇక్కడ  పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఏదో అన్యాయం జరిగిందన్నట్టుగా ఓట్లు అడగడం సిగ్గుచేటు. ప్రజల బాధలు, ఇబ్బందులను ఈటెల పరిష్కరించలేదు. బీజేపీ పక్షాన పోటీ చేస్తూ అభివృద్ధి చేస్తా అనడం విచారకరమన్నారు.

ఏడేళ్లలో ముఖ్య పట్టణాలు ఎలా అభివృద్ధి జరిగిందో ప్రజలు గమనిస్తున్నారు. మళ్లీ ఈటెలకు ఓటేస్తే ఈ ప్రాంతం తిరోగమనం వైపు వెళ్తుంది. మేము టీఆర్ఎస్ వైపే ఉంటామని ప్రజలు చెబుతున్నారు. అనేక సంక్షేమ పథకాలు అందుకుంటున్న తాము ఈటెల మాదిరిగా తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వాళ్లం కాదని ప్రజలు చెబుతున్నారు. టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే అని అర్ధం అవుతోందని ఆయన అన్నారు.

పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షాలకు హుజురాబాద్ లో వచ్చిన వరదకు, బురదకు ఈటెల కారణం కాదా? హౌసింగ్ బోర్డ్ కాలనీకి వరదలు రావడం ఇది మూడోసారి. ఈటెల ఒక మోరీ కూడా కట్టివ్వలేదు.. చేతగాని దద్దమ్మ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించకపోవడానికి ఈటెల కారణం కాదా. హుజురాబాద్ నియోజకవర్గానికి శనిలా ఈటల పట్టాడు. సీఎం కేసీఆర్ హుజురాబాద్ పట్టణానికి రూ. 50 కోట్లు కేటాయించారన్నారు.

హౌసింగ్ బోర్డు కాలనీకి ప్రభుత్వం సాయం చేస్తుంది. ఇల్లు ముంచుడు.. టిఫిన్ పెట్టుడు ఈటెల పని. దళిత ఎమ్మెల్యేలను కొడకల్లారా ఏమీ అభివృద్ధి చేశారన్న ఈటల రాజేందర్.. తాను ఏ అభివృద్ధి చేశాడో చెప్పాలి. చర్చకు రావాలని సవాల్ విసురుతుంటే ఎందుకు స్వీకరించలేకపోతున్నాడు. హౌసింగ్ బోర్డ్ కాలనీకి ఎన్ని సార్లు వచ్చి మోసపు మాటలు చెప్పావో అక్కడే చర్చ పెడదాం రా. నువ్వు ఉన్నప్పుడు ఏం చేసావో చెప్పు ఇప్పుడు ఏం జరుగుతుందో నేను చెప్తా. ఇండ్లు మునిగిన ప్రాంతంలో డ్రైన్ కట్టి చూపిస్తామన్నారు.

జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ… ఈటెలకు ఓట్లు కావాలి తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోడు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినా జమ్మికుంటలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ప్రజల ముందు రాజకీయ నాయకులను ఈటెల హేళన చేస్తాడు. రెండేళ్ల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడమే ఈటెల పనిగా పెట్టుకున్నాడని అన్నారు.