నేటితో ముగియనున్న హుజూరాబాద్‌ నామినేషన్ల ఉపసంహరణ గడువు

Huzurabad nomination withdrawal deadline ending today

Huzurabad nomination withdrawal deadline ending today

హుజూరాబాద్‌ ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగియనుంది. ప్రస్తుతం 42 మంది బరిలో ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ గడువు ముగుస్తుంది. దీంతో ఎంత మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారు, ఎందరు పోటీలో ఉండనున్నారనే విషయంతో సాయంత్రం తెలనుంది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల కమిషన్‌ గుర్తులు కేటాయించనుంది.

ఈ నెల 30న హుజురాబాద్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో అభ్యర్థులు ఇటీవల నామినేషన్లు వేశారు. తాజాగా అధికారులు వాటి పరిశీలన చేపట్టారు. 61 నామినేషన్లలో 19 తిరస్కరించారు. ఉప ఎన్నిక బరిలో ప్రస్తుతం 42 మంది అభ్యర్థులు ఉన్నారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. ఉపసంహరణకు ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంది. ఈలోగా ఇదివరకే నామినేషన్‌  వేసిన అభ్యర్థుల్లో ఎవరైనా పోటీ నుంచి తప్పుకోవాలంటే నేరుగా వచ్చి సంతకం పెట్టి నామపత్రాల్ని తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం టీఆర్‌‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి ముగ్గురితో పాటు 32 మంది స్వతంత్రులు, ఏడుగురు ఇతరపార్టీల సభ్యులు ఉప ఎన్నికల బరిలో ఉన్నారు.

మాజీమంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ఉపఎన్నిక తప్పనిసరి అయింది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్‌ 1న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 30న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 2న ఫలితాలు వెలువడనున్నాయి.